Begin typing your search above and press return to search.

మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ.. ఇప్పుడేం జరగనుంది?

By:  Tupaki Desk   |   27 July 2021 4:25 AM GMT
మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ.. ఇప్పుడేం జరగనుంది?
X
వేలాది కోట్లు బ్యాంకుల వద్ద అప్పులు తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించకుండా.. గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి పారిపోయిన షోకిల్లా వ్యాపారవేత్త కమ్ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు తాజాగా బ్రిటన్ లోని లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దివాలా తీస్తున్నట్లుగా సోమవారం సంచలన తీర్పును ఇచ్చింది. దీంతో మాల్యా దొంగాటకు చెక్ పడినట్లుగా చెప్పక తప్పదు. వేలాది కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ లో విలాసవంతమైన విల్లాలో కాలక్షేపం చేస్తున్న ఆయన.. తాజాగా కోర్టు తీర్పుతో.. ఆయన ఆస్తుల్ని జప్తు చేసుకోవటానికి వీలు చిక్కిందని చెప్పాలి. తాజాగా లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ తీర్పు ఇచ్చారు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల స్వాధీనానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు తమ బకాయిల్ని వసూలు చేసుకునే వెసులుబాటు లభించినట్లు అవుతుంది. ఇప్పటివరకు లండన్ లో బెయిల్ మీద ఉన్న మాల్యాకు తాజా పరిణామాలు షాకింగ్ గా మారటం ఖాయమని చెప్పాలి. మరోవైపు తనకున్న అప్పుల్ని తాను పూర్తిగా తీర్చేస్తానని.. అందుకు తగ్గ ప్రణాళికతో బ్యాంకులు రావాలని మాల్యా కోరటం తెలిసిందే.

అయితే.. మాల్యా చెబుతున్నట్లుగా బ్యాంకులకు సకాలంలో తీసుకున్న అప్పుల్ని పూర్తిగా చెల్లిస్తారన్న నమ్మకం లేకపోవటం.. అందుకు తగ్గ ఆధారాల్ని చూపించకపోవటంతో ఆయన పిటిషన్ ను న్యాయమూర్తి రిజెక్టు చేశారు. దివాలా ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకునేందుకు సైతం మాల్యాకు అనుమతి ఇవ్వలేదు. దీనికి సంబంధించిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసింది. దీంతో.. మాల్యా ముందున్న మార్గాలన్ని మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు.

కోర్టులో భారతీయ బ్యాంకులు దాఖలు చేసిన దివాలా ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని మాల్యా తరఫు న్యాయవాది ఫిలిప్ మార్షల్ పిటిషన్ కు ఎదురుదెబ్బ తగలటంతో ఈ ఆర్థిక నేరగాడుఏం చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విచిత్రమైన విషయం ఏమంటే.. ఆర్థిక నేరగాడైన మాల్యాను భారత్ కు అప్పగించేందుకు అవసరమైన న్యాయప్రక్రియ మొత్తం పూర్తి అయినట్లుగా వార్తలు వచ్చాయి.

అదే సమయంలో.. మాల్యా దివాలా తీసినట్లుగా లండన్ కోర్టు ప్రకటించటం కాకతాళీయంగా జరిగిందా? అన్నది చర్చగా మారింది. దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయిల్ని స్టేట్ బ్యాంక్ తదితర కంపెనీల నుంచి అప్పుగా తీసుకున్న మాల్యా.. ఆ మొత్తాన్ని చెల్లించకుండా లండన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ను భారత్ కు తీసుకురావటంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆస్తుల్ని వేలం వేసే మార్గం సుగుమం అవుతుందని చెబుతున్నారు. వేలం వేసి.. అప్పును జీరో చేసేలా పరిణామాలు మరెప్పటికి జరుగుతాయో చూడాలి.