Begin typing your search above and press return to search.

'ఎర' కేసులో సిట్ కు వరుస షాకులు.. భారీ ట్విస్టులు ఖాయమా?

By:  Tupaki Desk   |   7 Dec 2022 4:17 AM GMT
ఎర కేసులో సిట్ కు వరుస షాకులు.. భారీ ట్విస్టులు ఖాయమా?
X
జాతీయ స్థాయిలో సంచలనంగా మారుతుందని.. దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న భారీ అంచనాల నడుమ తెలంగాణ అధికారపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఎర కేసుహాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. అనుకున్నది ఒకటైతే.. జరుగుతున్నది మరొకటి అన్నది మాటగా మారింది.

దీనికి కారణం.. తాజాగా చోటు చేసుకున్న పరిణామమే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఎర వేసి.. వారిని పార్టీ మారేలా ప్రభావితం చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నారంటూ మరో నలుగురిని నిందితులుగా సిట్ పేర్కొనటం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురిని నిందితులుగా చేర్చి.. వారిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తాజాగా మరో నలుగురు పేర్లు తెర మీదకు రావటం ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. డాక్టర్ జగ్గుస్వామి.. తుషార్ వెల్లాపల్లి.. బి. శ్రీనివాస్ లను నిందితులుగా పేర్కొనాలని కోరుతూ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీం.. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు.. సిట్ వాదనను తిరస్కరిస్తూ.. వారి పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు.. వీరిని నిందితులుగా పేర్కొనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు.. అవినీతి నిరోధక చట్టం కేసుల్ని సిట్ దర్యాప్తు చేయకూడదన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు తీరు సిట్ అధికారులకు షాకింగ్ గా మారింది.

నలుగురిని నిందితులుగా మార్చాలన్న సిట్ వాదనను కోర్టు ప్రశ్నించింది. దీనికి కారణం లేకపోలేదు. ఎఫ్ఐఆర్ లోనూ.. రిమాండ్ రిపోర్టులోనూ ఈ నలుగురి ప్రస్తావన లేనప్పుడు.. ఇప్పుడు వారిని నిందితులుగా ఎలా చేరుస్తామన్న కీలక ప్రశ్నను సంధిస్తున్నారు.

అంతేకాదు.. అవినీతి నిరోధక చట్టం కింద కేసుల్ని లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ.. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ మాత్రమే విచారణ చేయాలని.. అందుకే ఈ నలుగురిని నిందితులుగా పేర్కొనే విషయానికి కోర్టు నో చెప్పింది. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ కు సంబంధించి మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైతే ఈ కేసును సిట్ హ్యాండిల్ చేస్తున్నప్పటికీ.. రానున్న రోజుల్లో దీని విచారణను సీబీఐకి అప్పగించే అవకాశాల్ని కొట్టి పారేయలేమని చెబుతున్నారు.

ఒకవేళ అదే జరిగితే సిట్ కు అంతకు మించిన భారీ షాక్ మరొకటి ఉండదంటున్నారు. సిట్ తో తాను చేయాల్సిన పనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా క్లారిటీతో ఉన్నారని.. అలాంటివేళ.. అనూహ్యంగా సీబీఐ చేతుల్లోకి వెళ్లే పరిణామం చోటు చేసుకుంటే కేసీఆర్ కు అంతకు మించిన ఎదురుదెబ్బ మరొకటి ఉండదంటున్నారు. సిట్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సైతం నోటీసులు పంపేందుకు వీలుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారంటూ కొన్ని ప్రధాన మీడియా సంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాంటి దాని కంటే ముందుగానే.. సిట్ ను సీబీఐ చేతికి ఇచ్చేయమని చెబితే.. అంతకు మించిన షాకింగ్ పరిణామం మరొకటి ఉండదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.