Begin typing your search above and press return to search.

ట్రంప్ కు షాక్.. అమెరికాలో భారతీయలకు ఊరట

By:  Tupaki Desk   |   10 Nov 2019 11:22 AM GMT
ట్రంప్ కు షాక్.. అమెరికాలో భారతీయలకు ఊరట
X
అమెరికాలోని భారతీయులకు భారీ ఊరట లభించింది. అమెరికాలో నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులకు ఉపశమనం దక్కింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వీసా నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న నిపుణుల జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు, పని కల్పించకూడదంటూ.. వాళ్ల అనుమతులు రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే..

దీనిపై కొందరు కోర్టులకు ఎక్కగా అమెరికా ప్రభుత్వ ఆదేశాలను అక్కడి కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసే వీలు దక్కింది.

2015లో బరాక్ ఒబామా ప్రభుత్వం విదేశీ నిపుణులైన భార్యలు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేలా హెచ్1 బీ వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ట్రంప్ సర్కారు రద్దు చేసింది. ఈ విధానం వల్ల అనేక మంది అమెరికా పౌరులు నష్టపోతున్నారని వారు ఉద్యోగాలు కోల్పోతున్నారని ట్రంప్ సర్కారు నిబంధనలు కఠినతరం చేసింది.

తాజాగా యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్టు ట్రంప్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని సూచించింది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో భారతీయులకు భారీ ఊరట లభించినట్టైంది. హెచ్1 బీ వీసాదారులతోపాటు ఇప్పుడు వారి జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో పనిచేసుకునే అవకాశం దక్కింది.

అయితే ట్రంప్ తెచ్చిన మరో ఆరోగ్య బీమా పాలసి మాత్రం అమలు కానుంది. అమెరికాలో అడుగుపెట్టిన 30 రోజుల్లోగా ఆరోగ్య బీమాను వలసదారులు తీసుకోవాలి. లేదంటే తమ ఆర్థిక వనరులను ప్రభుత్వానికి చూపించి ఆమోదం పొందితేనే అమెరికాలో ఉండగలుగుతారు.