Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ ఉద్యోగులకి భారీ షాక్ .. ఎంతమందిని తొలగించబోతుందంటే ?

By:  Tupaki Desk   |   6 Nov 2019 10:09 AM GMT
ఇన్ఫోసిస్ ఉద్యోగులకి భారీ షాక్ .. ఎంతమందిని తొలగించబోతుందంటే ?
X
భారత రెండో అతిపెద్ద సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఇబ్బందులని ఎదుర్కొంటుంది. ఆదాయం, లాభాలు అధికంగా చూపుతున్నారని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్, సిఎఫ్ఓ నీలాంజన్ రాయ్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కంపెనీ లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు పాల్పడిన అనైతిక చర్యలపై కంపెనీ బోర్డు కు, అలాగే అమెరికా లోని సెక్యూరిటీస్ ఎక్స్చేంజి కమిషన్ కి ఫిర్యాదు చేసారు. ఈ విషయం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఇన్ఫోసిస్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని తెలుస్తోంది.

ఐటీ సంస్ధ కాగ్నిజెంట్‌ బాటలోనే దేశీ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కూడా ఉద్యోగులను తొలిగించే పనిలో పడింది. దాదాపు 10,000 నుంచి 12,000 మందిని ఇంటికి సాగనంపబోతుంది అని తెలుస్తుంది. ఇందులో దాదాపు 2200 మంది సీనియర్‌ మేనేజర్లను సాగనంపాలని కంపెనీ నిర్ణయించినట్టు సమాచారం. జూనియర్‌, మిడిల్‌ లెవెల్‌ అసోసియేట్లను సైతం 2 నుంచి 5 శాతం వరకూ తొలగించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేటున్నారు. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.

అలాగే మరోవైపు అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ వంటి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల్లో 50 మంది వరకూ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని కోరనుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ సంస్థాగత ఖర్చులను తగ్గించుకునేందుకే ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు. అందుకే మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల్ని ఎంచుకున్నారని అంటున్నారు. గతంలో ఉద్యోగుల పని సామర్ధ్యం ఆధారంగా తొలగించే ఇన్ఫోసిస్‌ ఈసారి భారీ సంఖ్యలో సిబ్బందిపై వేటు వేయడం అసాధారణమని నిపుణులు చెప్తున్నారు. ఆటోమేషన్‌ రాకతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్నారు.