Begin typing your search above and press return to search.

‘‘పనామా’’ దెబ్బకి పెద్ద వికెట్ల విలవిల

By:  Tupaki Desk   |   6 April 2016 5:24 AM GMT
‘‘పనామా’’ దెబ్బకి పెద్ద వికెట్ల విలవిల
X
ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసిన పనామా పేపర్స్ కుంభకోణం వ్యవహారం పలు దేశాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించటమే కాదు.. పలువురు దేశాధినేత పదవులకు ముప్పు తీసుకొచ్చాయి. పనామా పుణ్యమా అని ఇప్పటికే ఐస్ లాండ్ ప్రధాని తన పదవికి రాజీనామా చేయగా.. మిగిలిన దేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా చరిత్రలోనే అతి పెద్దదిగా చెబుతున్న పనామా పేపర్స్ కుంభకోణం ప్రభావం తీవ్రంగా ఉందనే చెప్పాలి.

పనామా పేపర్స్ ప్రకంపనలు ఏ రేంజ్ లో ఉన్నాయన్నది చూస్తే..

= ఐస్ లాండ్ దంపతులు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఒక విదేశీ సంస్థ ద్వారా మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లుగా పనామా పేపర్స్ వెల్లడించాయి. దీంతో.. ఆయన తీరుపై పెద్దఎత్తున విమర్శలు రావటం.. ఆ దేశంలో నిరసనలు.. ఆందోళనలు ఊపందుకోవటంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తాజాగా వెలువడిన వివరాల్నివెల్లడించకపోవటం.. పనామా పేపర్స్ ఆధారాలతో వివరాల్ని బయటపెట్టటంతో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

= ట్రాన్స్ పరెంట్ చిలీ అధ్యక్షుడు గొంజాలో డెలావియు తన పదవికి రాజీనామా చేశారు. బహమాస్ లో నమోదైన ఐదు కంపెనీలకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలతో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

= పనామా పేపర్స్ వెల్లడించిన కుంభకోణంపై అర్జెంటీనా.. బ్రెజిల్ ప్రభుత్వాలు స్పందించాయి. బయటకు వచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తామని.. పన్ను ఎగ్గొట్టిన వారిపై 150 శాతం మేర జరిమానా విధిస్తామని పేర్కొంది.

= రష్యా అధ్యక్షుడు పుతిన్ పై వచ్చిన ఆరోపణలపై మాత్రం కాస్త భిన్నమైన రియాక్షన్ నెలకొంది. ఇదంతా పుతిన్ ను టార్గెట్ చేయటానికే ఇలా జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. పుతినో ఫోభియాతో ఇలాంటివి చేస్తున్నారన్న ఖండనల్ని ఆ దేశం చేస్తోంది. పుతిన్ కు విదేశీ ఖాతాలు అస్సలు లేవని స్పష్టం చేస్తున్నారు.

= చనిపోయిన తన తండ్రి ఇయాన్ కి ఒక కంపెనీతో ఉన్న సంబంధాలుప్రైవేటు వ్యవహారంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తేల్చారు.

= పనామా పేపర్స్ కుంభకోణంలో బయటకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు పేట్రో పొరొషెంకో తన మీద వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. తాను పూర్తిస్థాయి పారదర్శకతతో ఉన్నట్లు వెల్లడించగా.. అక్కడి విపక్షాలు మాత్రం ఆయనపై విరుచుకుపడుతున్నాయి.

= పనామా పేపర్స్ లో చైనా అధ్యక్షుడి మీద ఆరోపణలు రావటం తెలిసిందే. అయితే.. ఆన్ లైన్ లో పనామా పేపర్స్ కు సంబంధించిన సమాచారం అందుబాటులోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో.. చైనీయులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. ఆన్ లైన్లో ఉన్నకథనాల్ని తొలగించటంపై చైనాలో విమర్శలు పెరుగుతున్నాయి.

= అమెరికా చట్టాల ఉల్లంఘన జరిగిందా? అన్న కోణంలో చూడాలని అమెరికా పేర్కొంటే.. పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ప్రాధమిక దర్యాప్తును ఫ్రాన్స్.. జర్మనీ.. ఆస్ట్రేలియా.. ఆస్ట్రియా.. స్వీడన్.. నెదర్లాండ్స్.. పాకిస్థాన్ తదితర దేశాలు ప్రకటించాయి.