Begin typing your search above and press return to search.

మోడీతో పీఎం రేసులోకి కేసీఆర్.. నితీష్ ను తిడుతూ లాగేశారే?

By:  Tupaki Desk   |   15 Aug 2022 7:39 AM GMT
మోడీతో పీఎం రేసులోకి కేసీఆర్.. నితీష్ ను తిడుతూ లాగేశారే?
X
విడాకులు ఇలా కాగానే.. అలా బీజేపీ నేతలు మొదలుపెట్టేశారు. తమ ఒకప్పటి మిత్రపక్షం.. ఇప్పటి ప్రతిపక్షం జేడీయూపై విమర్శల వాడి పెంచారు. మోడీతో పోల్చుకుంటూ నితీష్ కుమార్ పీఎం రేసులో రావడాన్ని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. ఈ మధ్యలో కేసీఆర్ కూడా పీఎం రేసులో ఉన్నారంటూ వారే మన సీఎంకు ప్రాధాన్యతనివ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందు జేడీయూ నేత నితీష్ కుమార్ నిలబడలేరని బీజేపీ నేత సుశీల్ మోడీ ఎద్దేవా చేశారు. ఇటీవలే బీజేపీకి బైబై చెప్పేసిన నితీష్ కుమార్.. బీహార్ లోని ప్రతిపక్షాలతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.మోడీతో తనను తాను పీఎం రేసులో పోల్చుకున్నారు.

ఈ క్రమంలోనే బీహార్ బీజేపీ నేత సుశీల్ మోడీ విమర్శల వర్షం కురిపించారు.బీజేపీకి మండల్, కమండల్ రెండు వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. విపక్షాల తరుఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు తరుచుగా వినపడుతోందన్న వార్తలపై సుశీల్ మోడీ ఎద్దేవా చేశారు.

ప్రధాన మంత్రి రేసులో మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకులు కూడా ఉన్నారని సుశీల్ చెప్పుకొచ్చారు.దీంతో కేసీఆర్ ను కూడా ప్రధానమంత్రి పోటీదారుగా బీజేపీ ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టైంది. నితీష్ సొంత బీహార్ లోనే ప్రభావాన్ని కోల్పోయారని.. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన సొంత పార్టీ నేతలు కూడా మళ్లీ గెలవరని ఎద్దేవా చేశారు.

నితీష్ కుమార్ కంటే శక్తివంతమైన, ఎక్కువ ప్రజాదరణ కలిగిన నేతలు చాలా మంది ఉన్నారు. టీఎంసీ నేత, బెంగాల్ సీఎం మతా బెనర్జీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కు ఆయా రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ ఉంది. పీఎం మోడీ ముందు నిలబడే పరిస్థితి నితీస్ కు లేదు. బీహార్ బయట ఆయన ప్రభావం ఏమీ ఉండదు. స్వరాష్ట్రంలోనూ ఆయనకు పాపులారిటీ లేదు అంటూ సుశీల్ నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా మన కేసీఆర్ ను పీఎం రేసులో బీజేపీ గుర్తించడాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ అంటే బీజేపీకి భయం ఉందని అంటున్నారు. దీన్ని బట్టి మన కేసీఆర్ కూడా ఇక పీఎంగా పరీక్షించుకోవచ్చన్న మాట..