Begin typing your search above and press return to search.

నితీష్‌కి మోడీతో ఫైట్ చేసే ద‌మ్ముందా?

By:  Tupaki Desk   |   18 Sep 2022 10:30 AM GMT
నితీష్‌కి మోడీతో ఫైట్ చేసే ద‌మ్ముందా?
X
ఎప్ప‌టి నుంచో ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విపై క‌న్నేసిన నేత‌ల్లో జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత‌, బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఒక‌రు. స‌మీక‌ర‌ణాలు అన్నీ క‌లిసివ‌స్తే ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టాల‌ని ఆశిస్తున్నారు. నితీష్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌, మ‌చ్చ‌లేని వ్య‌క్తిత్వం, అవినీతి ఆరోప‌ణ‌లు మ‌చ్చుకు కూడా లేక‌పోవ‌డం, మిగ‌తా పార్టీల నేత‌ల మాదిరిగా త‌న వార‌సులెవ‌రినీ రాజ‌కీయాల్లోకి తేక‌పోవ‌డం వంటివి, కేంద్ర కేబినెట్ మంత్రిగా, దాదాపు 20 ఏళ్లుగా ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ప్ల‌స్ ప్లాయింట్స్‌.

ఇక మైన‌స్ పాయింట్స్ విష‌యానికొస్తే.. నితీష్‌ది గోడ మీద పిల్లివాట‌మ‌ని ఆయ‌న‌ను తెలిసిన‌వారు చెబుతారు. ప్ర‌స్తుతం ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న బిహార్‌లో లాలూప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్‌తో ఒక‌సారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. మ‌ళ్లీ అది అవినీతి పార్టీ అని చెప్పి ఆర్‌జేడీతో విడిపోయి బీజేపీతో క‌ల‌సి ప్ర‌భుత్వాన్ని స్థాపించారు. మ‌ళ్లీ బీజేపీ కాద‌ని ఇటీవ‌ల తాను అవినీతి పార్టీ అని విమ‌ర్శించిన ఆర్‌జేడీతోనే మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. త‌ద్వారా ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎటు కావాలంటే అటు దూకుతార‌నే విమ‌ర్శ‌లు కొని తెచ్చుకున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి పోటీప‌డేవారిలో ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, మాజీ సీఎం, స‌మాజ్‌వాదీ పార్టీ స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్‌, మాజీ సీఎం, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి, మాజీ సీఎం, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శ‌ర‌ద్ ప‌వార్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌ అర‌వింద్ కేజ్రీవాల్, బిహార్ సీఎం నితీష్ కుమార్‌, డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ వంటి వారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉవ్విళ్లూరుతున్నా ఆయ‌న‌కు అంత సీన్ లేద‌నేవారే ఎక్కువ‌.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాల‌న్నిటి ఆమోదంతో నితీష్ కుమార్ ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ఆయ‌న సీఎంగా ఉన్న బిహార్‌లో 40 లోక్ స‌భ సీట్లు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వీటిలో 17 సీట్ల‌ను బీజేపీ, 16 జేడీయూ, 6 లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ గెలుచుకున్నాయి. ఈ మూడు పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ కూట‌మిగా క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి.

నితీష్‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా అన్ని పార్టీలు ఎంచుకోవాలంటే ముందు ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిహార్‌లోని 40 ఎంపీ సీట్ల‌లో అత్య‌ధిక సీట్ల‌ను ద‌క్కించుకోవాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఎక్కువ సీట్లు ద‌క్కించుకున్నా ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉండ‌టం అంత సులువేమీ కాదు. ఎందుకంటే ప‌శ్చిమ బెంగాల్‌లో 42, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 80, మ‌హారాష్ట్రలో 40, త‌మిళ‌నాడులో 39 పార్ల‌మెంట‌రీ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ, అఖిలేష్ యాద‌వ్‌, మాయావ‌తి, శ‌ర‌ద్ ప‌వార్‌, స్టాలిన్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కువ పార్ల‌మెంటు సీట్లు సాధిస్తే తాము కూడా ప్ర‌ధాని రేసులో ఉన్నామంటూ ముందుకొస్తారు. కాబ‌ట్టి నితీష్ వీలైన‌న్ని ఎక్కువ సీట్ల‌ను బిహార్‌లో గెల్చుకోవాల్సి ఉంటుంది. అయితే అదంతా తేలిక కాదు. బిహార్‌లో బీజేపీ బ‌లంగా ఉంది. అలాగే రాష్ట్రీయ జ‌నతాద‌ళ్ కూడా ఉంది. ఇంకా లోక్ జ‌న‌శ‌క్తి, కాంగ్రెస్ త‌దిత‌ర పార్టీలు బ‌లంగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బిహార్‌లో అత్య‌ధిక సీట్లు సాధించ‌డం నితీష్ కు సులువు కాదు.

ఇక నితీష్ కుమార్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి పోటీ చేయాల‌ని యోచిస్తున్నారు. యూపీలోని పూల్పూర్ బ‌రిలో నిల‌బ‌డాల‌ని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఆహ్వానిస్తున్నారు. పూల్పూర్ ఒక‌ప్పుడు కాంగ్రెస్ కంచుకోట‌. దేశ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ప‌లుమార్లు అక్క‌డ నుంచి గెలుపొందారు.

నితీష్ బిహార్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి లోక్‌సభ‌కు పోటీ చేస్తే రాజకీయాలు ఆస‌క్తిగా మారతాయి. ప్ర‌స్తుతం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం వార‌ణాసి (కాశీ) ఎంపీగా ఉన్నారు. 2014లో కూడా మోడీ ఇక్క‌డ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ప్ర‌ధాని మోడీపై పోటీ చేసిన అర‌వింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. ఆ త‌ర్వాత కేజ్రీవాల్ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారింది. ఇప్ప‌డు నితీష్.. మోడీతో పోటీప‌డ‌టం కూడా అంత సులువేమీ కాదంటున్నారు.

అయితే అవినీతికి అడ్డాగా, అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్న బిహార్‌కు ముఖ్య‌మంత్రిగా నితీష్ కుమార్ 2005లో బాధ్య‌త‌లు చేప‌ట్టాక బిహార్ స్థితిగ‌తుల‌ను స‌మూలంగా మార్చారు. పెద్ద ఎత్తున రోడ్ల‌ను నిర్మించారు. ల‌క్ష‌లాది మంది ఉపాధ్యాయుల‌ను నియ‌మించారు. అవినీతిని నిర్మూలించ‌డానికి పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌త ప్ర‌భుత్వాల‌తో పోలిస్తే మౌలిక రంగాల్లో విశేష ప్ర‌గ‌తినే చూపారు.

ఈ విష‌యంలో నితీష్‌కు పోటీ వ‌చ్చేవారు లేరు. అయితే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కేంద్రంలో 274 మంది ఎంపీల బ‌లం అవ‌సరం. ఇంత‌మంది ఎంపీల‌ను నితీష్ కూడ‌గ‌ట్ట‌గ‌ల‌రా అనేది ఇక్క‌డ ప్ర‌శ్న‌.