Begin typing your search above and press return to search.

బిహార్ ఓటర్ల చైతన్యం...కరోనా టైంలోనూ భారీ పోలింగ్

By:  Tupaki Desk   |   28 Oct 2020 6:00 PM GMT
బిహార్ ఓటర్ల చైతన్యం...కరోనా టైంలోనూ భారీ పోలింగ్
X
కరోనా మహమ్మారి నేపథ్యంలో తొలిసారి జరుగుతోన్న బిహార్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు జనాలు ఓటేసేందుకు వస్తారా? రారా? అన్న సందేహాలు చాలామంది వ్యక్తం చేశారు. బిహార్ ఎన్నికలు సక్సెస్ అయితే, మరి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, పలు రాష్ట్రాల ఎన్నికల సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో ఓటర్లు ఆ అనుమానాలను పటాపంచలు చేశారు. కరోనా కాలమైనా...కలికాలమైనా....తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందుంటామని నిరూపించారు. కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూనే తొలి దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో తొలి విడత16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 6గంటల వరకు 53.46 శాతం పోలింగ్ నమోదైంది. 2015 ఎన్నికల తొలి విడత పోలింగ్ శాతం 54.94శాతంగా ఉంది. పూర్తి స్థాయి వివరాలు వెలువడితే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

తొలి దశ పోలింగ్ జరిగిన 71 అసెంబ్లీ సెగ్మెంట్లలో 31 వేల పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అన్ని పోలింగ్ బూత్ లలో ఓటర్లకు థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్, మాస్కుల వంటివి పక్కాగా అమలయ్యేలా చూశారు. ముఖ్యంగా ఓటర్లంతా సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు పోలింగ్ సిబ్బంది, ఓటర్లు కూడా చైతన్యవంతులై కచ్చితంగా భౌతిక దూరంతో పాటు అన్ని కోవిడ్ నిబంధనలు పాటించారు. కొన్ని చోట్ల మినహా మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు అమలు కావడం విశేషం. బీహార్ మంత్రి, బీజేపీ నేత, గయా అసెంబ్లీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ కమలం గుర్తు కలిగిన మాస్కును ధరించి ఓటేయడం వంటి ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నక్సల్స్ ప్రభావిత సెగ్మెంట్లలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బీహార్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, చివరిదైన మూడో దశ పోలింగ్ నవంబర్ 7న జరుగనుంది. నవంబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి.