Begin typing your search above and press return to search.

చెల్లితో పాముకి రాఖీ కట్టించిన అన్నయ్య.. కానీ , క్షణాల్లో ఊహించని ఘోరం

By:  Tupaki Desk   |   24 Aug 2021 5:31 AM GMT
చెల్లితో పాముకి రాఖీ కట్టించిన అన్నయ్య.. కానీ , క్షణాల్లో ఊహించని ఘోరం
X
రక్షా బంధన్ రోజు అందరిలానే ఆ అన్నయ్య కూడా చెల్లితో రాఖీ కట్టించుకున్నాడు. అయితే , తాను ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే పాములకు కూడా చెల్లితో రాఖీ కట్టించాలనుకున్నాడు. ఆ కోరికే అతడి ప్రాణాలను తీసింది. నాగు కు అతడి చెల్లి రాఖీ కడుతున్న సమయంలో నాగిని కు కోపం వచ్చింది. వెంటనే అతడి కాలిపై కాటువేసింది. క్షణాల్లోనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచాడు.

ఇలా రాఖీ పండగ రోజే.. చెల్లి కళ్లు ముందే, అన్నయ్య చనిపోయాడు. బీహార్‌ లోని సారణ్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం సారణ జిల్లాలోని శీతల్‌పూర్ గ్రామానికి చెందిన దిగంబర్ సాహా, మంజు కున్వార్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ముగ్గురు అన్నాదమ్ముళ్లలో మన్మోహన్ రెండో వాడు. అతడి వయసు 24. వృత్తిరీత్యా రైతు. గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐతే వ్యవసాయంతో పాటు పాములంటే మన్మోహన్‌ కు ఎంతో ఇష్టం. పాములను మచ్చిక చేసుకోవడంలో దిట్ట. గ్రామంలోకి పాములు వస్తే ఎవరూ భయపడరు. ఎందుకంటే మన్మోహన్ ఉన్నాడన్న ధైర్యం.

అందరూ ఇంట్లో పిల్లులు, కుక్కలను పెంచుకుంటే, మన్మోహన్ మాత్రం పాములను పెంచుకుంటున్నాడు. నాగు, నాగిని జంటను కన్నపిల్లల్లా సాదుతున్నాడు. పామును వన్యప్రాణిలా కాకుండా సొంత కుటుంబ సభ్యుడిలా, అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. ఆదివారం రాఖీ పండగ కావడంతో మన్మోహన్ చెల్లి సులోచన అతడికి రాఖీ కట్టింది. ఐతే తనతో పాటు నాగుపాముకు కూడా రాఖీ కట్టాలని.. అది కూడా మన తమ్ముడే కదా అని చెల్లితో చెప్పాడు. అన్న విజ్ఞప్తి మేరకు నాగుకు కూడా సులోచన రాఖీ కట్టింది.

ఐతే ఆ సమయంలో అక్కడే ఉన్న నాగిని మెల్లగా మన్మోహన్ వైపు వెళ్లి, అతడి కాలిపై కాటువేసింది. పాము కాటు వేసినా అతడు లైట్ తీసుకున్నాడు. కానీ నిమిషాలు గడిచే కొద్ది పరిస్థితి విషమించింది. అనంతరం చూస్తుండగానే అతడు కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మన్మోహన్ కన్నుమూశాడు. పదేళ్లుగా పాముల సంరక్షణకు పాటుపడిన మన్మోహన్‌ పాము కాటు వల్లే మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, మన్మోహన్‌ పాములకు రాఖీ కట్టించే ప్రయత్నం మొత్తాన్ని సెల్‌ఫోన్లలో బంధించిన స్థానికులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.