Begin typing your search above and press return to search.

మంత్రి చేసిన పనికి బీజేపీకి సారీ చెప్పిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   2 March 2017 7:12 AM GMT
మంత్రి చేసిన పనికి బీజేపీకి సారీ చెప్పిన కాంగ్రెస్
X
బీహార్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ లీడర్ అబ్దుల్‌ జలీల్‌ మస్తానీ ప్రధాని మోడీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు... తన సమక్షంలోనే ప్రజలతో చేయించిన అవమానకరమైన పని దుమారం రేపుతోంది. ఆయన చర్యలపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ నేతలు మస్తానీకి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు. కాగా... ప్రధాని పట్ల మస్తానీ చేసిన వ్యాఖ్యలను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. కాంగ్రెస్ పార్టీలు ఖండించాయి.. ఆ తరువాత జలీల్ మస్తానీ కూడా దానిపై విచారం వ్యక్తంచేసి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే.. బీజేపీ నేతల ఆగ్రహం మాత్రం చల్లారలేదు. ఆయన్ను బర్తరఫ్ చేయాలని, దేశద్రోహం కేసు పెట్టాలంటూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.

రెండు రోజుల క్రితం పూర్ణియా జిల్లాలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో జలీల్ మాట్లాడుతూ 50 రోజులు గడిచినా నోట్ల రద్దు కష్టాలు తీరలేదని, ఇందుకు శిక్షగా మోడీని బూట్లతో కొట్టాలంటూ పిలుపునిచ్చారు. దీంతో రెచ్చిపోయిన కొందరు కార్యకర్తలు వెంటనే స్టేజిపైకి చేరుకుని అక్కడున్న మోడీ చిత్రపటాన్ని బూట్లతో కొట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ సభ్యులు మంత్రి తీరుపై మండిపడ్డారు. అతడిని మంత్రవర్గం నుంచి తప్పించాల్సిందేనని అసెంబ్లీలో పట్టుబట్టారు. దేశ ప్రధానిని అలా అగౌరవపరిచే హక్కు ఆ మంత్రికి రాజ్యాంగం కల్పించలేదని వారు అంటున్నారు.

కాగా.. మంత్రి వ్యాఖ్యలను ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అశోక్‌ చౌదరి.. సీఎం నితీశ్ లు ఖండించారు. తమ పార్టీ ఇలాంటి చర్యలను ఎంతమాత్రమూ సమర్థించదని అశోక్ రిటెన్ గా ప్రకటన విడుదల చేశారు. అయితే.. బీజేపీ సభ్యులు మాత్రం నిన్న ఈ కారణంగా అసెంబ్లీలో అల్లకల్లోలం సృష్టించారు. జలీల్ చర్యలపై బిహార్ లోని పలు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు కేసులు పెట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/