Begin typing your search above and press return to search.

తలనొప్పులన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయ్‌

By:  Tupaki Desk   |   24 Sep 2015 4:36 AM GMT
తలనొప్పులన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయ్‌
X
పొత్తులు కుదుర్చుకోవడం అనేది చాలా చిన్న సంగతి. సిద్ధాంతాలు ఒకటే అయిన పార్టీలు పొత్తులు పెంట్టుకుంటేనే అవి కలకాలం నిలబడడం లేదు. తగాదాలు తప్పడం లేదు. అలాంటిది.. సిద్ధాంతాల్లో సారూప్యత కూడా లేకుండా.. కేవలం ఎన్నికల అవసరం కోసం పొత్తులు కుదుర్చుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? కలసి కాపురం ప్రారంభించిన నాటినుంచి మొత్తం కలహాల మయంగానే ఉంటుంది. ఇప్పుడు బీహార్‌ ఎన్నికల సమరాన్ని ఎదుర్కొంటున్న మహాకూటమి కూడా అలాంటి అవస్థలోనే ఉంది. నిత్యం ఆ కూటమిలోని పార్టీకి ఏదో ఒక చికాకులు ఎదురవుతూనే ఉన్నాయి.

అన్నీ ఒక కూటమిలోని పార్టీలే... ఏ ఒక్క నియోజకవర్గంలోనూ వారు ఓట్లు పంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఒకరిని ఒకరు తిట్టుకుంటే తప్ప వారికి ఓట్లు వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి చిత్రమైన పరిస్థితుల్లో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం లాలూ మీద నిందాపూర్వకమైన ప్రచారం చేస్తున్నదంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. మా పార్టీలన్నీ ఒక్కటిగానే ఉన్నాయి. ఒకరిమీద ఒకరికి అసంతృప్తులు లేవు అంటూ సీఎం అభ్యర్థి నితీశ్‌ కుమార్‌ స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

అలాగే ఇప్పుడు మరో తగాదా బయటకు వచ్చింది. నితీశ్‌ సర్కారులోని ఆరోగ్యమంత్రి రాంధని సింగ్‌ కు ఈసారి టిక్కెట్‌ ఇవ్వలేదు. పొత్తుల పుణ్యమాని ఆయన సొంత నియోజకవర్గం కర్‌ ఘర్‌ ఈసారి గల్లంతయింది. తనకు అదే సీటు కావాలని ఆయన పట్టుబట్టడంతో.. నితీశ్‌ టిక్కెట్‌ ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన అలిగి.. జేడీయూ పార్టీకి, మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. మంత్రులు ఓడిపోవడం కూడా మామూలు పరిణామమే గానీ.. సరిగ్గా ఎన్నికలకు ముందు మంత్రి రాజీనామా చేయడం వేరే పార్టీలో చేరడం చిత్రమైన పరిణామం. మహాకూటమిలో తొలుత చేరి తర్వాత వెనక్కు తగ్గి ఒంటరిగా పోటీచేస్తున్న ములాయంసింగ్‌ పార్టీ తరఫున తాను తనకు అచ్చివచ్చిన సొంత నియోజకవర్గంలోనే బరిలో ఉంటానని రాంధని సింగ్‌ చెబుతున్నారు.

అన్నిటికంటె మించి.. మహాకూటమి.. టిక్కెట్లకు డబ్బుకోసం అమ్ముకుంటున్నదంటూ ఈ మంత్రిగారు ఆరోపించారు. అసలే నాలుగు పార్టీల కూటమి.. ఇలా కక్కుర్తి పడి, లేదా ఎటూ కూటమి మొత్తం గెలిచే ఛాన్సు లేదులే అనే ఆలోచనలో పడి ఆయన ఆరోపిస్తున్నట్లుగా టిక్కెట్లను డబ్బుకు అమ్ముకోవడం నిజమే అయితే గనుక.. ఆ కూటమి ఖచ్చితంగా చతికిలపడుతుందని పలువురు అంచనావేస్తున్నారు.