Begin typing your search above and press return to search.

ఎలుక‌ల వ‌ల్లే వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ట‌!

By:  Tupaki Desk   |   1 Sep 2017 1:42 PM GMT
ఎలుక‌ల వ‌ల్లే వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ట‌!
X
నాయ‌క‌గ‌ణం ఒక్కోసారి ఎంత వింత‌గా మాట్లాడుతారో చెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం. వ‌ర‌ద‌లు ఎక్క‌డైనా వ‌ర్షాల కార‌ణంగా వ‌స్తాయి కాని ఎలుక‌ల వ‌ల్ల రావు క‌దా?! కానీ ఎలుక‌ల వ‌ల్లే వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ట‌! ఈ మాట ఎవ‌రో సాదాసీదా వ్య‌క్తి అన్న‌ది కాదు. సాక్షాత్తు ఓ మంత్రి. బీహార్‌ లో ఈ మధ్య 500 మంది పొట్ట‌న‌బెట్టుకున్న భారీ వ‌ర‌ద‌ల‌కు ఆయ‌న చెప్పిన కార‌ణం ఎలుక‌లు. వ‌ర‌ద‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన స‌మ‌యంలో నీటి వ‌న‌రుల శాఖ మంత్రి ల‌ల‌న్ సింగ్ మాట్లాడుతూ.. న‌దుల గ‌ట్ల‌ను ఎలుక‌లు దెబ్బ‌తీయ‌డం వ‌ల్ల ఈ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

క‌మ‌లా బాల‌న్ న‌ది గ‌ట్టు తెగ‌డానికి ఎలుక‌లే ప్ర‌ధాన కార‌ణం. గ్రామ‌స్థులు న‌ది ఒడ్డునే త‌మ ధాన్యాన్ని నిల్వ చేసేవాళ్లు. దీంతో అది ఎలుక‌ల‌కు నిల‌యంగా మారింది. ఆ ఎలుక‌లే న‌ది గ‌ట్టుకు గండి కొట్టాయి అని మంత్రి తెలిపారు. దీనిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా మండిప‌డ్డాయి. సాక్షాత్తూ మంత్రే వ‌ర‌ద‌లకు ఇలాంటి కార‌ణం చెప్పి త‌ప్పించుకోవాల‌ని చూడ‌టాన్ని ఆర్జేడీ త‌ప్పుబ‌ట్టింది. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి శక్తి సింగ్ యాద‌వ్ స్పందిస్తూ... ఇంత‌కుముందు సీజ్ చేసిన మ‌ద్యాన్ని మొత్తం ఎలుక‌లు తాగేశాయ‌ని చెప్పారు. ఇప్పుడు వ‌ర‌ద‌ల‌కు కూడా అవే కార‌ణ‌మంటున్నారు. ఎలుక‌లు ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే వాటి నిర్మూల‌న‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. ఇవ‌న్నీ నిరాధార వాద‌న‌లు అని అన్నారు.

ప్ర‌తిప‌క్షాలే కాదు అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మితిలేష్ తివారీ కూడా మంత్రి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. ``అన్ని డ్యామ్‌ లు ప‌టిష్ఠంగానే ఉన్నాయ‌ని సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్ర‌భుత్వం లిఖిత‌పూర్వ‌కంగా చెప్పింది. ఇప్పుడు ఎలుక‌ల‌ను ఎందుకు నిందిస్తున్నారు. ఈ వ‌ర‌ద‌ల‌కు అధికారులే కార‌ణం. వాళ్ల‌నే బాధ్యుల్ని చేయాలి`` అని తివారీ అన్నారు.