Begin typing your search above and press return to search.

మ‌ద్యం షాపుల‌కు కొత్త లుక్‌

By:  Tupaki Desk   |   21 Dec 2015 10:46 AM GMT
మ‌ద్యం షాపుల‌కు కొత్త లుక్‌
X
మ‌ద్యం షాపుల గురించి చాలా మందికి అభ్యంత‌రం ఉన్న‌ప్ప‌టికీ రాష్ర్ట ఖ‌జానాకు త‌న వంతు సాయం చేయ‌డంలో ఈ దుకాణాల పాత్ర వెల‌క‌ట్ట‌లేనిది. ఆ షాపుల్లో మ‌ద్యం మాత్ర‌మే అమ్మాల‌ని ఏం లేదు క‌దా. ఇపుడు ట్రెండ్ మార్చి పాలు కూడా అమ్మడానికి డిసైడ్ అయ్యారు. ఏంటి మ‌ద్యం - పాలు... ఒక‌టే చోట ల‌భిస్తాయా? ఇదేం చిత్రం? అయినా ఇది మ‌నదేశానికి సంబంధించిన విష‌యం కాక‌పోవ‌చ్చు అనుకుంటున్నారా. మ‌న‌దేశంలోనే త్వర‌లో అమ‌ల్లోకి రానున్న అప్‌ డేట్ తాలుకు స‌మాచారం ఇది.

బీహార్‌ లో మద్యం దుకాణాలు పాల షాపులుగా మారనున్నాయి. వైన్‌ షాపుల్లో బ్రాందీ - విస్కీ - బీరు - రమ్ము - జిన్‌ లకు బదులు పాలు - పాల పదార్ధాలు విక్రయించనున్నారు. బీహార్‌ సర్కార్‌ మద్యం వ్యాపారులను ఇందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నది కూడా. నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో మహాకూటమి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు పూర్తయ్యింది. నితీశ్‌ ఎన్నికల్లో విజ‌యం సాధించేందుకు మ‌ద్య‌నిషేధం హామీ బాగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దశలవారీగా మద్యం నిషేధం అమలు చేయనున్న‌ట్లు సర్కారు ప్ర‌క‌టించింది. దీనికి అనుగుణంగా మద్యం వ్యాపారులను ముందు నుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ వ్యాపారాలపై దృష్టి మరల్చే విధంగా చర్యలు తీసుకుంటూ మద్యం వ్యాపారులను పాల అమ్మకాల దిశగా నితీశ్ స‌ర్కారు వారు ప్రోత్సహిస్తున్నారు.

ఇందులో భాగంగా మద్యం షాపుల్లో పాలు - పాల పదార్ధాలు విక్రయించేందుకు వీలుగా బీహార్‌ పాల ఉత్పత్తదారుల సహకార సమాఖ్యతో ప్రభుత్వం చర్చలు జరుతోంది. బీహార్‌ లో సుధా పాలు - స్వీట్స్‌ బాగా ఫేమస్‌. బీహార్‌ లోని ఆరు వేల మద్యం దుకాణాల్లో వీటిని అమ్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వైన్‌ షాపుల యజమానులు మద్యం అమ్మకాలతో కోల్పోయే నష్టాన్ని ఈ రూపంలో కొంతవరకైనా భర్తీ చేయొచ్చని నితీశ్ స‌ర్కారు భావిస్తోంది. అంతేకాకుండా ఈ షాపుల్లో పని చేస్తున్న సిబ్బంది ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అయితే మద్యం అమ్మకాల ద్వారా లక్షలు గడించే వ్యాపారులు... పాల అమ్మకంపై విముఖ చూపుతున్నారు. సుధా పాలు - స్వీట్లు అమ్మితే చిల్లర పైసలు - పది రూపాయల నోట్లు లెక్కిస్తూ వందలు కళ్ల చూడాల్సి వస్తుంది మినహా... వేలు - లక్షలు వచ్చే పరిస్థితిలేదంటూ ఇప్పటి నుంచే నిట్టూరుస్తున్నారు. బీహార్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మద్య నిషేధం ఏ విధంగా అమలు జరుగుతుందో చూడాలి.