Begin typing your search above and press return to search.

దేవెగౌడను ప్రధానిని చేసింది చంద్రబాబు కాదా..?

By:  Tupaki Desk   |   27 Feb 2018 5:56 PM GMT
దేవెగౌడను ప్రధానిని చేసింది చంద్రబాబు కాదా..?
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకుంటుంటారు. ఆయనకు నిజంగానే చాలా ఘనతలు ఉంటే ఉండొచ్చు కానీ, అప్పుడప్పుడు తనది కాని ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకుంటారని ఆయనపై ఓ ముద్ర ఉంది. పెద్దపెద్ద పనులు చేసిన చరిత్ర ఉన్నప్పటికీ పెద్దపెద్ద మాటల చెప్పడంలో కూడా చంద్రబాబు సిద్ధహస్తులు. తాజాగా ఆయన తాను యునైటెడ్ ఫ్రంట్‌లో ఉన్నప్పుడు జరిగిన పరిణామాల గురించి గుర్తుచేసుకుంటూ అప్పట్లో దేవెగౌడను తానే ప్రధానిని చేశానని అన్నారు. అంతకుముందు కూడా చంద్రబాబు ఓ సందర్బంలో ఇదే మాట చెప్పారు. తాజాగా మరోసారి ఆయన... తన రాజకీయ జీవితానికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ అదే విషయం చెప్పారు. అయితే... దేవెగౌడ మాత్రం వివిధ సందర్భాల్లో తాను ప్రధాని అయిననాటి రోజులను గుర్తు చేసుకున్నా, అందులో ఎక్కడా చంద్రబాబు పేరే ప్రస్తావించిన దాఖలాలు లేవు. అంతేకాదు.. తాను కర్ణాటక సీఎం కావడానికి, దేశానికి ప్రధాని కావడానికి కూడా కారణం ఓ వ్యక్తంటూ ఇంకో పేరు చెప్తున్నారు. మరి.. చంద్రబాబు చెబుతున్నది నిజమా.. లేదంటే స్వయంగా దేవెగౌడ చెబుతున్నది నిజమా?

చంద్రబాబు తన తాజా ఇంటర్వ్యూలో వాజిపేయి తొలిసారి ప్రధాని కావడం.. ఆ తరువాత కొద్దిరోజులకే ఆయన ప్రభుత్వంకూలిపోవడం.. ఆ తరువాత దేవెగౌడ ప్రధాని కావడం గురించి మాట్లాడారు. వాజపేయి ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత కొత్త ప్రధానిని నిర్ణయించే బాధ్యత యునైటెడ్ ఫ్రంట్ తనకు అప్పగించిందని.. జ్యోతిబసు - సుర్జిత్ సింగ్ బర్నాలా - ములాయం లాలూ వంటి అందరినీ ఒప్పించి ప్రధానిని డిసైడ్ చేశానని ఆయన చెప్పారు. అప్పుడు ప్రధాని అంటే దేవెగౌడే. కానీ.. దేవెగౌడ సరిగ్గా నెలరోజుల కిందట అంటే, 2018 జనవరి 27న ఏం చెప్పారో తెలుసా.. తాను కర్ణాటక సీఎం కావడానికి, దేశానికి ప్రధాని కావడానికి ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయిక్ కారణం అని చెప్పారు.

ఈ కింది వీడియోలో 5.35 నిమిషాల నుంచి 5.60 నిమిషాల మధ్య
అది చూడొచ్చు.




దేవెగౌడ ఈ మాట చెప్పే సమయానికి ఆ సమావేశంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ... కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి కూడా ఉన్నారు. అప్పటి పరిణామలన్నీ వారు ముగ్గురికీ తెలియనివి కావు. వారు ముందు దేవెగౌడ అబద్ధం చెప్పే అవకాశమే లేదు.

అంతేకాదు.. ఏడాదిన్నర కిందట బెంగళూరులో నిర్వహించిన మరో కార్యక్రమంలోనూ దేవెగౌడ అదే మాట చెప్పారు. బిజూ పట్నాయిక్ తనను ప్రధానిని చేశారని చెప్పారు.

ఈ కింది వీడియోలో 1.45 నిమిషాల నుంచి 5.34 నిమిషాల మధ్య అది చూడొచ్చు.



ఈ రెండు వీడియోల్లో దేవెగౌడ మాటలు వినడమే కాదు.. దేవెగౌడ ఆత్మకథలోనూ అదే విషయం రాసుకున్నారాయన. తనను తొలిసారి కర్ణాటక సీఎంను చేసిందీ, ప్రధానిని చేసిందీ బిజూ పట్నాయిక్ అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. మరి చంద్రబాబు ఎలా క్లెయిం చేసుకుంటున్నారో ఏమో.