Begin typing your search above and press return to search.

రాజు జన్మదినాన 6 లక్షల సైకిళ్లతో రైడ్

By:  Tupaki Desk   |   12 Nov 2015 9:15 AM GMT
రాజు జన్మదినాన 6 లక్షల సైకిళ్లతో రైడ్
X
రాజరికానికి రోజులు చెల్లిపోయి చాలా రోజులే అయిందని మనం భావిస్తున్నాం. ఎందుకంటే మనకిప్పుడు రాజులు లేరు. చక్రవర్తులూ లేరు. కానీ ప్రపంచంలో ఇంకా కొన్ని దేశాల్లో రాజవంశాలు ఉనికిలో ఉండటమే కాదు. వారసత్వపరంగా వస్తున్న అధికారాలను కూడా అనుభవిస్తున్నాయి. నిర్ణయాధికారాలు - శాసనాధికారాలు పూర్తిగా వారి చేతుల్లో లేకపోవచ్చు కానీ, ఆ వంశాల వారసత్వంపై ప్రజలు పెట్టుకున్న అపార అభిమానమే వారికి ఇంకా మనుగడను కల్పిస్తోందంటే అతిశయోక్తి కాదు.

బ్రిటన్ రాజవంశం గురించి వారి వైభోగం గురించి మనందరికీ తెలుసు. ప్రజానీకం ఆదరణను ఈ స్థాయిలోనే పొందుతున్న మరో రాజకుటుంబం థాయ్‌ లాండ్‌ లో ఉంది. పైగా ఆ వృద్ధ రాజు అంటే ఆ దేశ ప్రజలకు పిచ్చి అభిమానం. ఎంతగా అంటే ఆయన 88వ పుట్టిన రోజు సందర్భంగా 6 లక్షలపైగా సైకిళ్లతో ర్యాలీ జరిపేటంత అభిమానం.

డిసెంబర్ 11న థాయ్‌ ల్యాండ్ రాజు మహా వజిరలాంగ్‌ కోర్న్ 88వ పుట్టిన రోజు వేడుకలను పునస్కరించుకుని దాదాపు 6,07,909 మంది థాయ్ ప్రజలు ఒక భారీ బైస్కిల్ రైడ్‌ లో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రాజధాని బ్యాంకాక్ నుంచి 99,999 మంది, ఇతర ప్రావిన్సులనుంచి 4,98,105 మంది, ఈ సైకిల్ ర్యాలీ కోసం పేర్లు నమోదు చేసుకున్నారని దేశీయాంగ శాఖ మంత్రి క్రిస్డా బూన్ రాజ్ ప్రకటించారు. ఇక విదేశాలనుంచి 9,805 మంది నాన్న కోసం బైక్ అనే పేరుతో జరగనున్న ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొనున్నారని తెలిపారు.

బ్యాంకాక్‌లో 29 కిలోమీటర్ల దూరం సాగే ఈ మెగా బైస్కిల్ రైడ్‌ కు డిసెంబర్ 11న రాజు మహా వజిరలోంగ్ కార్న్ స్వయంగా నేతృత్వ వహించనున్నట్లు ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఏకకాలంలోనే ఈ రాజ సైకిల్ ర్యాలీ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. నాన్న కోసం బైక్ అనే పేరే గమ్మత్తుగా ఉంది కదూ...