Begin typing your search above and press return to search.

సిటిజన్ పోలీస్‌ కు నెటిజన్ల సలాం

By:  Tupaki Desk   |   8 Nov 2017 5:50 AM GMT
సిటిజన్ పోలీస్‌ కు నెటిజన్ల సలాం
X

జనం బయట ఏమాత్రం స్పందించకపోయినా ఆన్‌లైన్లో మాత్రం అన్నిటిపైనా స్పందిస్తున్నారు. తాజాగా ఇంటర్నెట్‌ లో ఓ వీడియోకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ప్రజల్లో ఇంతగా సోషల్ కన్సెర్న్ ఉందా అనిపించకమానదు. ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే....

మధ్యప్రదేశ్‌ లోని భోపాల్ లో ఓ కారు రాంగ్ రూట్లో వస్తుండగా బైక్ పై వస్తున్న యువకుడొకరు తన బైకును దానికి అడ్డంగా నిలిపాడు. దాంతో కారు నడుపుతున్న వ్యక్తి అతనిపై దాడి చేసి కొట్టాడు. సీసీ కెమేరాల్లో రికార్డయిన ఈ వీడియో నవంబరు 5న పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో 2 లక్షల మందికి పైగా దీన్ని షేర్ చేశారు. అంతేకాదు... డైరెక్టుగా ఆ వీడియోను చూసిన వారి సంఖ్య రెండు కోట్లు దాటేసింది. ఇక ఆ వీడియోను లైక్ చేసిన వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. ఆ యువకుడి ధైర్యాన్ని ప్రశ్నించే తత్వాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టినవారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది.

ఆ కుర్రాడి పేరు సాహిల్ భాతవ్.. వయసు 22 ఏళ్లు. అక్టోబరు 3న ఆయనకు భోపాల్ లోని షాపురా ప్రాంతంలో ఎదురైన అనుభవం ఇది. కోలార్ ప్రాంతానికి చెందిన ఆయన పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. కోచింగ్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బైక్ పై వస్తుండగా షాపురాలోని మనీష్ మార్కెట్ ప్రాంతంలో ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన కారు తన మార్గాన్ని అడ్డంగా రావడంతో బైక్ ఆపి కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి ఆయన ట్రాఫిక్ ఉల్లంఘన గురించి మాత్రమే చెప్పారు. కానీ... ఆ కారు నడుపుతున్న వ్యక్తి వచ్చి దాడి చేశాడు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన కారు డ్రైవరే కారు యజమాని అని - ఆయన పేరు ఆకర్ష్ సక్సేనా అని గుర్తించారు. దీనిపై సాహిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించిన పాపానికి తనపై దాడి చేశాడని.. కారుతో తనను ఢీకొట్టే ప్రయత్నమూ చేశాడని ఆయన ఆరోపించారు. సాహిల్ చేస్తున్న ఆరోపణలన్నీ నిజమని సీసీ టీవీ వీడియో దృశ్యాలు చెప్తున్నాయి.

ఇదీ ఆ వీడియో.. మీరూ చూడండి.