Begin typing your search above and press return to search.

కెన్నడీ భార్యను ట్రాప్ చేయాలని చూసిన క్లింటన్

By:  Tupaki Desk   |   1 Dec 2015 4:07 AM GMT
కెన్నడీ భార్యను ట్రాప్ చేయాలని చూసిన క్లింటన్
X
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాసలీలల వ్యవహారం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఇంట్లో చక్కటి చుక్కలాంటి హిల్లరీ క్లింటన్ ఉన్నప్పటికీ.. అయ్యగారి చూపులు మాత్రం ఎప్పుడూ బయటే ఉండేవి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయనపై రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. గతంలో తన దగ్గర పని చేసే భామతో క్లింటన్ సరస సల్లాపాలు జరపటం.. అవికాస్తా బయటకు పొక్కటం.. దాన్ని తొలుత ఖండించి.. ఆపై చెంపలేసుకొని బుద్ధిగా ఉంటానని చెప్పటం తెలిసిందే.

అంతటితో క్లింటన్ రాసలీలల వ్యవహారం మీద చర్చ ఆగింది. కానీ.. క్లింటన్ మహా సరసుడని.. అయ్యగారు ఒకరిద్దరితో కాక.. చాలామంది మీదే ఆయన వ్యవహారాలు నడిపించారన్నట్లుగా తాజాగా విడుదలైన ఒక పుస్తకంలో పేర్కొనటంతో బిల్ క్లింటన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. గత కొద్ది కాలంగా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటున్న ఆయన.. విందులు.. వినోదాల్లో పాల్గొన్నట్లు మాత్రమే వార్తలు వచ్చాయి.

తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల ‘‘బిల్ అండ్ హ్యారీ; సో దిస్ ఈజ్ దట్ థింగ్ కాల్డ్ లవ్’’ అంటూ ఒక పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకాన్ని డార్విన్ పార్టర్.. డాన్ ఫోర్త్ ప్రిన్స్ అనే వారు రాశారు. వారు.. ఈ పుస్తకంలో బిల్ క్లింటన్ యవ్వారాల గురించి ప్రస్తావించారు. లైంగిక సంబంధాల విషయంలో దివంగత అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మాదిరే వ్యవహరించే వారని.. చివరకు కెన్నడీ భార్య ను కూడా క్లింటన్ టార్గెట్ చేసినట్లుగా పేర్కొన్నారు.

అమెరికా 35వ అధ్యక్షుడిగా వ్యవహరించిన జాన్ ఎఫ్ కెన్నడీని షోకిల్లాగా అభివర్ణిస్తారు. ఆయనకు చాలామందితో లైంగిక సంబంధాలు ఉన్నట్లుగా చెబుతారు. ప్రసిద్ధ హాలీవుడ్ తార.. శృంగార దేవతగా అభివర్ణించే మార్లిన్ మన్రోతో ఆయనకు సంబంధాలు ఉండేవి. ఇలా ఎంతోమందితో ఆయన వ్యవహారాలు నడిపాడు. ఆయన బాటలోనే బిల్ క్లింటన్ నడిచాడన్న విషయం తాజా పుస్తకంలో పేర్కొనటం విశేషం. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎంతో మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసిన కెన్నడీ సతీమణి జాక్వలిన్ ను బిల్ క్లింటన్ టార్గెట్ చేయటం.. ఆమెను ప్రలోభ పెట్టాలని చూసినా.. ఆమె మాత్రం అతి కస్టమ్మీదా బిల్ క్లింటన్ ను దూరంగా పెట్టారని చెప్పుకొచ్చారు.

జాన్ ఎఫ్ కెన్నడీకి.. బిల్ క్లింటన్ కు ఒక పోలిక ఉందని.. వారిద్దరూ ఆడవాళ్ల కోసం విపరీతంగా ప్రయత్నించేవారని.. తాము మనసు పడిన వారి నుంచి ‘‘నో’’ అన్న మాట వస్తే సహించేవారు కాదని తాజా పుస్తకం పేర్కొంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. జాన్ ఎఫ్ కెన్నడీని క్లింటన్ ను విపరీతంగా అభిమానించే వారు. చివరకు తాను విపరీతంగా అభిమానించిన వ్యక్తి భార్యను కూడా క్లింటన్ వదలకపోవటం గమనార్హం.