Begin typing your search above and press return to search.

భారీగా మ‌ద్యం కొనుగోళ్లు: మ‌ద్యం వ్యాపారి పై కేసు

By:  Tupaki Desk   |   5 May 2020 5:30 PM GMT
భారీగా మ‌ద్యం కొనుగోళ్లు: మ‌ద్యం వ్యాపారి పై కేసు
X
లాక్‌ డౌన్‌ తో 45 రోజులుగా మూసి ఉన్న మ‌ద్యం దుకాణాలు కేంద్రం స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో సోమ‌వారం తెరుచుకున్నాయి. మ‌ద్యం దుకాణాలు పునఃప్రారంభం కావ‌డంతో చిత్ర‌విచిత్ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. దుకాణాలు ప్రారంభం కాక‌ముందే గంట‌ల ముందే వేచి ఉన్నారు. ఈ సంద‌ర్భంగా కిలోమీట‌ర్ల మేర మందుబాబులు నిల్చుని మందు కోసం ప‌డిగాపులు ప‌డ్డారు. అయితే ఈ దుకాణాల ప్రారంభం సంద‌ర్భంగా కొంద‌రు పూజ‌లు చేయ‌డం.. బాణాసంచా కాల్చ‌డం వంటివి చేశారు. ఇక మ‌రికొంద‌రు మ‌ద్యం ల‌భించ‌డంతో బాటిల్ ప‌ట్టుకుని డ్యాన్స్‌లు చేశారు. మ‌ద్యం దుకాణాలు ప్రారంభం రోజే గ‌ల్లాపెట్టె గ‌ల‌గ‌ల‌లాడింది. భారీగా కొనుగోళ్లు జ‌ర‌గ‌డంతో కోట్ల మేర మద్యం వ్యాపారం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. కొంద‌రు మ‌ద్యం భారీగా కొనుగోళ్లు చేశారు. ఏకంగా ల‌క్ష‌ - అర ల‌క్ష విలువైన మ‌ద్యం కొనుగోలు చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

క‌ర్నాట‌క‌లోని బెంగళూరుకు చెందిన మద్యంప్రియులు రూ.లక్షల విలువ చేసే మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఓ వ్యక్తి రూ.52 వేల విలువైన లిక్కర్ కొంటే.. మరో వ్యక్తి రూ.లక్షకు కొనుగోలు చేశాడు. ఈ క్ర‌మంలో మద్యం కొనుగోళ్లకు సంబంధించిన బిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటి బిల్లులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అంత పెద్ద సంఖ్య‌లో మ‌ద్యం విక్ర‌యించిన దుకాణంపై ఎక్సైజ్ అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. దాని య‌జ‌మానిపై కేసు న‌మోదు చేశారు.

ప్రభుత్వం అనుమతించిన దానికంటే అధిక మొత్తంలో విక్ర‌యాలు జ‌ర‌ప‌డంతో అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. లిక్కర్ షాపు యజమానితో పాటూ ఆ బిల్లు పోస్ట్‌ చేసిన వ్యక్తిపై కూడా అధికారులు చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే దుకాణ య‌జ‌మాని వాస్త‌వంగా 8 మంది వినియోగదారులు మ‌ద్యం కొనుగోలు చేశారు. కానీ ఒక కార్డు ద్వారా బిల్లు మొత్తం చెల్లించడంతో ఒకే బిల్లు త‌యారైంద‌ని య‌జ‌మాని చెప్పాడు.