Begin typing your search above and press return to search.

త‌న కెరీర్ లో అతి పెద్ద త‌ప్పు అదేన‌న్న బిల్ గేట్స్!

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:19 AM GMT
త‌న కెరీర్ లో అతి పెద్ద త‌ప్పు అదేన‌న్న బిల్ గేట్స్!
X
బిల్ గేట్స్ పేరు విన్నంత‌నే ఆయ‌నో స‌క్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా గుర్తుకు రావ‌ట‌మే కాదు.. కొన్నేళ్ల పాటు ప్ర‌పంచ కుబేరుడిగా నిలిచిన విష‌యం గుర్తుకు వ‌స్తుంది. అలాంటి ఆయ‌న త‌న కెరీర్ లో భారీ త‌ప్పు చేయటాన్ని ఊహించ‌గ‌ల‌మా? తాను చేసిన త‌ప్పున‌కు వేలాది కోట్ల ఆదాయాన్ని పోగొట్టుకోవ‌టానికి కార‌ణ‌మ‌ని భావించ‌గ‌ల‌మా? కానీ.. ఒక విష‌యంలో గేట్స్ తాను చాలా పెద్ద త‌ప్పు చేసిన‌ట్లుగా చెప్పుకున్నారు.

మొబైల్ మార్కెట్ ను ఆండ్రాయిడ్ కు కోల్పోవ‌టం తాను చేసిన అతి పెద్ద త‌ప్పుగా గేట్స్ చెప్పుకున్నారు. సాఫ్ట్ వేర్ ప్ర‌పంచంలో.. అందునా మొబైల్ ఫ్లాట్‌ ఫాంలో ఎవ‌రైతే ఆప‌రేటింగ్ సిస్టంలో విజేత‌గా నిలుస్తారో వారే మార్కెట్ మొత్తాన్ని ఏలుతార‌న్న విష‌యాన్ని ఆయ‌న మ‌రోసారి ప్ర‌స్తావించారు.

విలేజ్ గ్లోబ‌ల్ అనే వెంచ‌ర్ క్యాపిట‌ల్ సంస్థ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో బిల్ గేట్స్ పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మొబైల్ ఫోన్ల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు గేట్స్ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యాపిల్ ఆప‌రేటింగ్ సిస్టం ఐఓఎస్ కు పోటీగా మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ను పెద్ద ఎత్తున త‌యారు చేయ‌క‌పోవ‌టం తాము చేసిన అతి పెద్ద త‌ప్పుగా చెప్పారు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల కాలంలో రెండుసార్లు ప్ర‌స్తావించారు గేట్స్.

ఆయ‌నీ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌టంలో కార‌ణం లేక‌పోలేదు. యాపిల్ ఐఓఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా గూగుల్ అండ్రాయిడ్ ను తీసుకురావటం.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫోన్ల‌లో అత్య‌ధికం అండ్రాయిడ్ ఓఎస్ తోనే ప‌ని చేస్తుండ‌టం తెలిసిందే. దీంతో.. ఇప్పుడు అండ్రాయిడ్ బ్రాండ్ లీడ‌ర్ గా మార‌ట‌మే కాదు.. మ‌రే ఓఎస్ ద‌రికి చేర‌లేనంత‌గా ఎదిగింది. వేలాది కోట్ల సంపాద‌న‌కు కార‌ణ‌మ‌వుతుంది.

ఇంత పెద్ద మొత్తంలో మైక్రోసాఫ్ట్ ఆదాయాన్ని కోల్పోయిన ప‌రిస్థితి. సెల్ ఫోన్ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందుతుంద‌న్న అంచ‌నా వేసి మొబైల్ కోసం మైక్రోసాఫ్ట్ త‌న సొంత ఓఎస్ విండోస్ మొబైల్ ను 2000లోనే ఆవిష్కరించింది. యాపిల్ త‌న ఐఫోన్ ను 2007లో అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ కు చెందిన అండ్రాయిడ్ 2008లో తెర మీద‌కు తెచ్చింది. అయితే.. యాపిల్.. గూగుల్ ఓఎస్ లతో పోలిస్తే మైక్రోసాఫ్ట్ విండోస్ వెనుక‌పడింది. ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌టం.. వాడ‌కంలో అంత‌గా సౌల‌భ్యం లేక‌పోవ‌టంతో మొబైల్ కంపెనీల‌న్నీ ఆండ్రాయిడ్ ఫోన్ల త‌యారీ మీద‌నే దృష్టి పెట్టారు.

ఇలా వెనుక ప‌డిన మైక్రోసాఫ్ట్.. చివ‌ర‌కు విండోస్ మొబైల్ సేవ‌ల్ని నిలిపివేయాల్సిన ప‌రిస్థితికి చేరుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. మొబైల్ విష‌యంలో మైక్రోసాఫ్ట్ ఏదైతే త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని భావించిందో అదేమీ చేయ‌లేక‌పోయింది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ బిల్ గేట్స్ తాను త‌ప్పు చేసిన‌ట్లుగా చెప్పుకున్నారు. అయితే.. అండ్రాయిడ్ ఓఎస్ మార్కెట్లోకి వ‌చ్చే నాటికి బిల్ గేట్స్ వ్యాపారం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ట్ర‌స్ట్ కార్య‌క్ర‌మాల మీద దృష్టి పెట్టారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ ఫెయిల్యూర్ మొత్తాన్ని త‌న ఖాతాలోకి వేసుకోవ‌టం విశేషం.

స్మార్ట్ ఫోన్ విప్ల‌వాన్ని గుర్తించ‌టంలో మైక్రోసాఫ్ట్ వ్యూహాన్ని విజ‌య‌వంతం కాకున్నా.. ఆ కంపెనీ మిగిలిన విష‌యాల్లో దూసుకెళుతోంది. తెలుగోడైన సీఈవో స‌త్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ విలువ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌స్తుతం రూ.70ల‌క్ష‌ల కోట్ల విలువైన మార్కెట్ ను అంత‌కంత‌కూ పెరిగేలా చేయ‌టంలో స‌త్య స‌క్సెస్ అవుతున్నారు. స్మార్ట్ ఫోన్ల విష‌యంలో ఫెయిల్ అయ్యామ‌న్న బాధ త‌ప్పించి.. మ‌రే విష‌యంలోనూ మైక్రోసాఫ్ట్ వెనుక‌బ‌డ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.