Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసాలపై భార‌తీయుల‌కు గుడ్ న్యూస్!

By:  Tupaki Desk   |   26 Jan 2018 1:29 PM GMT
హెచ్1బీ వీసాలపై భార‌తీయుల‌కు గుడ్ న్యూస్!
X
అమెరిక‌న్ల‌లోని లోక‌ల్ సెంటిమెంట్ను రెచ్చ‌గొట్టి మ‌రీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా అధికారం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో - న‌ల్ల‌జాతివారిపై వ‌ర్ణ‌వివ‌క్ష‌ - ఇత‌ర దేశాల వారిపై ప్రాంతీయ వివక్షలు కొత్త కాక‌పోయిన‌ప్ప‌టికీ....ట్రంప్ రాక‌తో ఆ లోక‌ల్ సెంటిమెంట్ మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా, అమెరిక‌న్ల ఉద్యోగాల‌ను భార‌తీయులు ఎగ‌రేసుకుపోతున్నారంటూ....జాత్యాహంకార దాడులు కూడా జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన వారెలాగూ వ‌చ్చారు.....ఇక‌పై వ‌చ్చేవారిని అడ్డుకోవాల‌నే `దూరా`లోచ‌న చేసిన ట్రంప్....హెచ్ 1 బీ వీసాల నిబంధనలను మ‌రింత కఠినం చేశారు. అమెరికాలోని స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో హైర్ అమెరికన్, బై అమెరికన్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. భార‌త్ కు చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుల‌కు ఈ చ‌ట్టం చిక్కులు తెచ్చిపెట్టింది. భార‌త్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలపై దాని ఎఫెక్ట్ బాగా ప‌డింది. దీంతో, తాజాగా హెచ్ 1బీ వీసాల‌పై ఇద్ద‌రు రిప‌బ్లిక‌న్ సెనేట‌ర్లు గురువారం నాడు ఓ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లులో హెచ్‌1బీ వీసాల సంఖ్యను 65వేల నుంచి 85వేలకు పెంచాలని ప్రతిపాదించారు.

ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి మ‌రింత‌మంది ప్రతిభావంతులైన ఉద్యోగులు అమెరికాకు వ‌చ్చేందుకు మార్గం సుగ‌మం అయ్యేలా ఇద్దరు రిప‌బ్లిక‌న్లు ఓ బిల్లును గురువారం సెనేట్ లో ప్ర‌వేశ‌పెట్టారు. హెచ్‌1బీ వీసాల సంఖ్యను పెంచాలని కోరుతూ 'ది ఇమ్మిగ్రేషన్‌ ఇన్నోవేషన్‌( I-‍ స్క్వేర్డ్‌) యాక్ట్‌ 2018` బిల్లును ఓర్రిన్‌ హాచ్ - జెఫ్‌ ఫ్లేక్ లు సెనేట్ లో ప్ర‌వేశపెట్టారు. వీరు ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు ప్రకారం హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు - పిల్లలకు వర్క్‌ పర్మిట్‌ కల్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా - ఆ వీసాదారులు ఉద్యోగాలు మారేందుకు తగిన సమయం కూడా కల్పించాల్సి ఉంటుంది. ఈ సరికొత్త బిల్లుకు మైక్రోసాఫ్ట్‌ - ఫేస్‌ బుక్‌ సహా అమెరికాలోని పలు దిగ్గ‌జ ఐటీ కంపెనీలు - అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ - ఐటీ ఇండస్ట్రీ కౌన్సిల్ - పలు వాణిజ్య సంఘాలు మద్దతిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థతో అమెరికా పోటీపడేందుకు ఈ బిల్లు దోహ‌ద‌ప‌డుతుంద‌ని హాచ్ - ప్లేక్ తెలిపారు. స్థానిక ఉద్యోగులు కొర‌త ఉన్న చోట వారికి బదులు ప్ర‌తిభావంతులైన నాన్ అమెరిక‌న్ల‌ను కంపెనీలు నియ‌మించుకునేందుకు ఈ హెచ్1బీ వీసాలు ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయ‌ని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా, మోసపూరితంగా కంపెనీలో చేరే ఉద్యోగుల‌ను ఆ వీసాలు నియంత్రిస్తున్నాయన్నారు. ఇత‌ర దేశాల నుంచి ప్రతిభావంతులు వ‌ల‌స రావ‌డం అమెరికాకు లాభ‌దాయ‌క‌మ‌ని, చెప్పారు. అయితే ఈ వీసాల‌ను ఔట్‌సోర్స్‌ ఉద్యోగాలకు వాడ‌కూడ‌ద‌ని, ఆ వీసాల వ‌ల్ల అమెరికన్ల జీతాలు తగ్గ‌కుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు.