Begin typing your search above and press return to search.

ఇలాంటి బిల్లుకు గుండెల్లో ద‌మ్ము ఎంతో కావాలి

By:  Tupaki Desk   |   27 July 2019 4:56 AM GMT
ఇలాంటి బిల్లుకు గుండెల్లో ద‌మ్ము ఎంతో కావాలి
X
మాట‌లు చెప్ప‌టం వేరు.. చేతల్లో చేసి చూపించ‌టం వేరు. ఆద‌ర్శాలు చెప్పినంత ఈజీ కాదు వాటిని అమ‌లు చేయ‌టం. మాట ఇస్తే.. ఇక అంతే.. దానికి క‌ట్టుబ‌డి ఉండ‌ట‌మే.. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా.. ఎంత క‌ష్ట‌మైనా స‌రే.. దాని కోసం ప్ర‌య‌త్నం చేసుకుంటూ పోవ‌ట‌మే త‌ప్పించి వెన‌క్కి త‌గ్గ‌టం అన్న‌ది ఉండ‌కూడ‌దన్న దివంగ‌త మ‌హానేత వైఎస్ తీరుకు త‌గ్గ‌ట్లే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా చూస్తే.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క బిల్లును ఆమోదించింది. ఈ త‌ర‌హా బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం ఏపీనే అవుతుంద‌ని చెప్పాలి. ప్రాజెక్టులతో లోగుట్టు య‌వ్వారాల‌కు తావు లేకుండా.. పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేసేలా ఒక వ్య‌వ‌స్థ‌ను సెట్ చేయ‌టానికి చాలానే ధైర్యం కావాలి. అలాంటిది త‌న ద‌గ్గ‌ర ట‌న్నుల లెక్క‌న ఉంద‌న్న విష‌యాన్ని తాజాగా స‌భ ఆమోదం పొందిన బిల్లుతో చెప్పేశారు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

ఆమోదం పొందిన బిల్లు ప్ర‌కారం ఇక నుంచి రూ.100 కోట్ల విలువైన ఏ కాంట్రాక్టు అయినా న్యాయ‌మూర్తి స‌మీక్ష త‌ర్వాతే ఖ‌రారు చేస్తారు. స‌మీక్ష చేసే న్యాయ‌మూర్తికి సాయం చేసేందుకు వీలుగా ప‌లువురు నిపుణులు ఉంటారు. అంతేకాదు.. ప్రాజెక్టును ప‌బ్లిక్ డొమైన్ లో పెట్టి.. వారిచ్చే స‌ల‌హాల్ని స్వీక‌రిస్తారు.

రాజ‌ధాని నిర్మాణం పేరుతో వేలాది కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌ట‌మే త‌ప్పించి.. పార‌ద‌ర్శ‌క‌త ఎంత‌న్న ప్ర‌శ్నకు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. విలువైన ప్ర‌జాధ‌నం వృధా కాకుండా ఉండేలా ఈ కొత్త విధానాన్ని అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ విధానంలో త‌ప్పులు చోటు చేసుకోకుండా ప్రాజెక్టులను అమ‌లు చేయ‌టం.. ప్ర‌జాధ‌నం వృధా కాకుండా చూసే వీలుంది. అన‌వ‌స‌ర‌మైన ఆరోప‌ణ‌ల‌కు చెక్ పెట్టే వీలుంటుంది.

ప్రాజెక్టుల్ని అప్ప‌గించిన త‌ర్వాత దాని మీద శీల ప‌రీక్ష జ‌రిగే క‌న్నా.. అంత‌కుముందే జ‌ర‌గ‌టం ద్వారా అభివృద్ధి ప‌నుల‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండ‌ట‌మే కాదు.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు దాదాపుగా త‌గ్గే వీలుంది. నిజాయితీగా పాల‌న చేయ‌గ‌ల‌మ‌న్న ధైర్యం ఉన్న ప్ర‌భుత్వం మాత్ర‌మే ఇలాంటి చ‌ట్టాల్ని తీసుకొచ్చే సాహ‌సం చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.