Begin typing your search above and press return to search.

చైనాకు గుడ్ బై చెప్పిన బిలియనీర్ జాక్ మా..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 3:21 AM GMT
చైనాకు గుడ్ బై చెప్పిన బిలియనీర్ జాక్ మా..!
X
చైనాలో వరుసగా మూడోసారి జీ జింగ్ పింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. గత నెలలో జరిగిన సీపీపీ సమావేశంలో జీ జింగ్ పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశంలోని సంపన్నులంతా వరుసబెట్టి చైనాకు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా చైనా బిజినెస్ టైకూన్ ఖ్యాతిగాంచిన జాన్ మా సైతం ఆ దేశాన్ని గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అలీబాబా వ్యవస్థాపకుడైన జాక్ మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. చైనాలో దిగ్గజ వ్యాపారవేత్తగా.. బిలియనీర్ గా జాక్ మా ఖ్యాతి గడించారు. అయితే జాక్ మాపై చైనా ప్రభుత్వం రెండేళ్లుగా కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ఆరు నెలల క్రితం ఆయన తన ఫ్యామిలీతో కలిసి జపాన్ రాజధాని టోక్యోలో నివాసం ఉంటున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా.. ఇజ్రాయెల్‌లను జాక్ మా ఫ్యామిలితో కలిసి చాలాసార్లు సందర్శించారు.

నిరుపేద కుటుంబానికి చెందిన జాక్ మా చైనాలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారు. ఇక తన 55వ పుట్టిన రోజున 2019లో జరుపుకున్నాడు. ఆ సమయంలోనే హఠాత్తుగా ఇ-కామర్స్ కంపెనీ అలీబాబా ఛైర్మన్‌ పదవీ నుంచి తప్పుకున్నారు. నాడు ఆయన తీసుకున్న నిర్ణయం యావత్ ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ.. "వర్క్ టేబుల్‌పై చనిపోవడం కంటే.. బీచ్‌లో చనిపోవడానికే ఇష్టపడుతా" అంటూ సంచలన ప్రకటన చేశారు.

ఇక 2020లో చైనా విధానాలను జాక్ మా తీవ్రస్థాయిలో విమర్శించారు. చైనా ఆర్థిక వ్యవస్థ తీరును విమర్శిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకులను వడ్డీ వ్యాపారులతో.. పాన్ షాప్ మనస్తత్వంతో పోల్చారు. నాటి నుంచి చైనా సర్కార్ జాక్ మా కు చెందిన యాంట్.. అలీబాబా కంపెనీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. గతేడాది యాంట్ కంపెనీ బ్లాక్‌బస్టర్ $37 బిలియన్ల ఐపీఓని చైనా షేధించింది. అలాగే నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తుందనే కారణంతో అలీబాబా కంపెనీపై రికార్డు స్థాయిలో $2.8 బిలియన్ల జరిమానాను విధించింది.

జాక్ మా చైనాలోని షాంఘై సమీపంలోని హాంగ్‌జౌ నగరంలో లగ్జీరీ హౌస్ ఉంది. అలీబాబా కంపెనీ ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉంది. చైనా అధికారులతో ఉద్రిక్తతల నేపథ్యంలోనే జాక్ మా స్పెయిన్.. నెదర్లాండ్స్‌తో సహా అనేక దేశాల్లో తరుచూ పర్యటిస్తున్నారు. గత ఆరు నెలలుగా జపాన్ రాజధాని టోక్యో లో ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నారు. 2020 నుంచి లో ప్రొఫైల్ జీవితాన్ని గడుపుతున్నారు. జిన్ పింగ్ కొంతకాలంగా చైనాలో వ్యాపారవేత్తల ప్రాబల్యం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆర్థిక విధానాల పేరుతో వారి కంపెనీలపై వేటు వేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటికే అనేక మంది సంపన్న వ్యాపారులు చైనాకు గుడ్ బై చెప్పేశారు. కొంతకాలంగా చైనా అధికారులకు జాక్ మా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఆయన ఆ దేశాన్ని విడిచి జపాన్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే హాంకాంగ్ కు చెందిన మార్నింగ్ పోస్ట్ "దేశం విడిచి పారిపోతున్న సంపన్నులు" అనే కథనాన్ని ఇటీవల ప్రచురించింది. జింగ్ పింగ్ చర్యలతో వ్యాపారులు భయపడుతున్నారని అందులో పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.