Begin typing your search above and press return to search.

ఈ బయో మీటర్..కరోనాను క్షణాల్లో గుర్తిస్తుంది

By:  Tupaki Desk   |   4 March 2020 10:30 PM GMT
ఈ బయో మీటర్..కరోనాను క్షణాల్లో గుర్తిస్తుంది
X
కరోనా...ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కొత్త వైరస్. ఈ వైరస్ బారిన పడితే.. బతికి బట్టకట్టడమన్నది కష్టమే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ప్రాణాలను తీసింది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ ను గుర్తించడం శాస్త్రవేత్తలకు ఓ పెద్ద సవాల్ గానే మారింది. వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది గుర్తించడానికే కనీసం 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే ఈ వైరస్ ను క్షణాల్లో గుర్తించే ఓ అద్భుతమైన పరికరాన్ని లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

లండన్ లోని న్యూకాజల్‌ లోని నార్తుంబ్రియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం బ్రీతింగ్ ద్వారా కరోనా వైరస్‌ను గుర్తించవచ్చంటున్నారు. దీనికి సంబంధించి ఓ బయో మీటర్‌ను వీరు కనుగొన్నారు. ప్రస్తుతం రోగుల లాలాజలాన్ని ల్యాబ్‌ కు పంపించి పరీక్షించడం ద్వారా.. కరోనా లక్షణాలను గుర్తిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. లండన్ శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టిన బయోమీటర్ ద్వారా.. కరోనా వైరస్స్‌ సోకిందా? లేదా? అన్న విషయాన్ని కొన్ని క్షణాల్లోనే కనుగొనవచ్చు.

ఈ బయో మీటర్‌ ను.. బ్రీత్ అనలైజర్‌ పని చేసేవిధానాన్ని ప్రామాణికంగా తీసుకుని తయారు చేశారు. మద్యం మత్తులో వాహనాదారులను గుర్తించేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న బ్రీత్ అనలైజర్ మాదిరే.. ఈ బయోమీటర్ కూడా పనిచేస్తుందని, అయితే ఇందులో డీఎన్ ఏ - ఆర్ ఎన్ ఏ - ప్రొటీన్లు - ఫ్యాట్‌ మాలెక్యూల్స్‌ ఉంటాయట. ఈ బయో మీటర్ తో కరోనా వైరస్‌ను మాత్రమే కాకుండా.. ఇతర ఊపిరితిత్తుల జబ్బులను - కేన్సర్ - మధు మేహం లాంటి జబ్బులను కూడా గుర్తించవచ్చట. విమానాశ్రయాలు - రైల్వేస్టేషన్లు - బస్టాండ్ల వద్ద ప్రయాణికులను ఈ బయో మీటర్ల ద్వారా చెక్ చేయడం సులభంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనాను క్షణాల్లోనే గుర్తించే ఈ బయోమీటర్ ఉత్పత్తిని యుద్ధప్రాతిపదికన చేపట్టి అన్ని దేశాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే లండన్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగేశారట.