Begin typing your search above and press return to search.

డిఫెన్స్ లో పదవీ విరమణ వయసు పెంపు.. రావత్ ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   14 May 2020 3:30 PM GMT
డిఫెన్స్ లో పదవీ విరమణ వయసు పెంపు.. రావత్ ఏమన్నారంటే?
X
ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు కదా. దేశంలో లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఏకంగా సైన్యాన్ని కూడా రంగంలోకి దింపాలన్న వాదన కూడా వినిపించింది. ఇలాంటి కీలక తరుణంలో త్రివిధ దళాల అధిపతి (ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) బిపిన్ రావత్... సైనిక బలగాల్లో పనిచేస్తున్న వారి పదవీ విరమణపై సంచలన కామెంట్లు చేశారు. డిఫెన్స్ స్టాఫ్ పదవీ విరమణ వయసును పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు త్వరలోనే ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

రావత్ చెబుతున్నట్లుగా డిఫెన్స్ స్టాఫ్ పదవీ విరమణ వయసును పెంచితే... ప్రస్తుతం సైనిక, వైమానిక, నావికా దళాల్లో పనిచేస్తున్న 15 లక్షల మందికి భారీ ప్రయోజనం చేకూరడం ఖాయమే. ప్రస్తుతం ఈ మూడు దళాల్లో పనిచేస్తున్న వారు కేవలం 15 నుంచి 17 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వెంటనే రిటైరైపోతున్నారు. మళ్లీ తిరిగి కొత్త వాళ్లు ఈ దళాల్లోకి ప్రవేశిస్తున్నారు. అయితే డిఫెన్స్ స్టాప్ పదవీ విరమణ వయసును గనుక పెంచితే ప్రస్తుతం ఈ మూడు దళాల్లో పనిచేస్తున్న 15 లక్షల మందికి ప్రయోజనం దక్కుతుంది. ఈ దిశగా రావత్ చేసిన ప్రకటనలో ఓ క్లారిటీ మిస్సయ్యిందన్న వాదన వినిపిస్తోంది.

అసలు ఈ విషయంపై రావత్ ఏం మాట్లాడారన్న విషయానికి వస్తే... ‘ఓ జవాన్‌ కేవలం 15 నుంచి 17 సంవత్సరాలు మాత్రమే ఎందుకు సేవలందించాలి.. 30 ఏళ్ల వరకు సేవ చేస్తే తప్పేముంది. త్రివిధ దళాల్లో పదవీ విరమణ వయసు తక్కువగా ఉన్నందున అత్యద్భుతంగా శిక్షణ పొందిన మానవ వనరులను స్వల్ప కాలంలోనే మనం కోల్పోతున్నాం. యుద్ధ సమయంలో మాత్రం ముందుండి పోరాడేది యుక్త వయసు వారే. సైన్యంలోని వైద్య విభాగంలో పనిచేసే నర్సింగ్‌ అసిస్టెంట్స్‌ 50 ఏళ్ల వరకు సేవలందిస్తే తప్పేముంది’ అని రావత్ పేర్కొన్నారు. అంటే... ఓ వైపు యుధ్ధంలో ముందుండి పోరాడేది యువకులేనని చెప్పిన రావత్... సైనికుల పదవీ విరమణ వయసును 30 ఏళ్ల వరకు పొడిగిస్తే తప్పేంటని ప్రశ్నించి ఈ విషయంలో క్లారిటీ మిస్సయ్యారన్న వాదన వినిపిస్తోంది.