Begin typing your search above and press return to search.

సీఎం గారూ! ఇది అజ్ఞానమా? అహంకారమా?

By:  Tupaki Desk   |   30 April 2018 2:11 AM GMT
సీఎం గారూ! ఇది అజ్ఞానమా? అహంకారమా?
X
కంగారేం లేదు.. ఇది మన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రి గారి గురించి ఎంతమాత్రమూ కాదు. త్రిపుర ముఖ్యమంత్రి - కమ్యూనిస్టుల కోట వంటి త్రిపుర రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడిన వెంటనే అధికార పగ్గాలుచేపట్టిన యువకుడు విప్లవ్ కుమార్ దేవ్ గురించి ప్రజల్లో వినిపిస్తున్న వ్యాఖ్య. ఆయన తాజాగా - యువతరం ప్రభుత్వ ఉద్యోగాలకు అర్రులుచాచడం బదులుగా ఆవుల్ని పెంచుకోవడం మేలని - తద్వారా వారిలో వ్యాపారాపేక్ష పెరుగుతుందని.. సులువుగా సంపన్నులు అయిపోవచ్చునని.. ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కావాలని కోరుకోవడం కరెక్టు కాదని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అవుతోంది.

ప్రధాని నరేంద్రమోడీ గతంలో ఉద్యోగాలకోసం ప్రయత్నించడం బదులుగా యువతరం పకోడీలు అమ్ముకుంటే మేలని వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటినుంచి మోడీ పకోడీ అంటూ దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కూడా వెల్లువెత్తాయి. కర్నాటక ఎన్నికల గంట మోగడానికి ముందు ఆ రాష్ట్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మోడీ వచ్చినప్పుడు కూడా... స్థానిక విద్యావంతులైన యువకులు మోడీ సభ బయట రోడ్ల మీద మోడీ పకోడీ - అమిత్ పకోడీలు అమ్ముతూ అరెస్టు అయిన వార్తలు కూడా ప్రజలకు గుర్తుండే ఉంటుంది.

చూడబోతే మోడీనే మేలేమో అనిపించేలా.. త్రిపుర ముఖ్యమంత్రి భాజపాకే చెందిన విప్లవ్ కుమార్ దేవ్.. యువకుల్ని ఆవులు పెంచుకోమంటున్నారు. ఆయన గతంలో ఇదే యువకులకు ఉద్యోగాలకు బదులు స్వయం ఉపాధి బెటర్ అనే సలహా ఇస్తూ కిళ్లీకొట్టు పెట్టుకోమని కూడా సలహా ఇచ్చి రికార్డు సృష్టించారు.

విప్లవ్ కుమార్ దేవ్ కు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కొత్త కాదు. గతంలో మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉన్నదని... దానిని యూరోపియన్ దేశాలు కాపీ కొట్టి వారు కనిపెట్టిన టెక్నాలజీగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆయన సెలవిచ్చారు. జనం అంతా నవ్వుకున్నారు. డయానా హేడెన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనం గుర్రుమన్నారు. ఇప్పుడు తాజాగా యువతరం మనోభిప్రాయాల్ని గాయపరిచేలా మాట్లాడుతుండడంతో... అసలు ఇంతకూ విప్లవ్ కుమార్ కు ఉన్నది అజ్ఞానమా? అహంకారమా? అనే అనుమానం కూడా ప్రజల్లో కలుగుతోంది. ఆయన ఏదో అజ్ఞానం కొద్దీ మాట్లాడుతుంటే గనుక.. ప్రజలు నవ్వుకుని వదిలేస్తారు గానీ... అహంకారంతో మాట్లాడుతోంటే గట్టిగానే బుద్ధి చెబుతారు. ఇలాంటి అహంకార నాయకుల్ని కట్టడి చేయకుంటే.. భాజపాకు దేశవ్యాప్తంగా కూడా ఎంతోకొంత ప్రభావం పడుతుందని పలువురు భావిస్తున్నారు.