Begin typing your search above and press return to search.

తీవ్ర నిర్ల‌క్ష్యం: బ‌ర్త్ డే పార్టీతో ఏకంగా 45మందికి క‌రోనా

By:  Tupaki Desk   |   10 May 2020 9:21 AM GMT
తీవ్ర నిర్ల‌క్ష్యం: బ‌ర్త్ డే పార్టీతో ఏకంగా 45మందికి క‌రోనా
X
ప్ర‌స్తుతం ప‌రిస్థితులు బాగాలేవు... వేడుక‌లు - శుభకార్యాలు - విందులు.. వినోదాలు మానివేసుకోవాల‌ని.. లేదా వాయిదా వేసుకోవాల‌ని ప్ర‌భుత్వ అధికారులు సూచిస్తున్నా ప్ర‌జ‌లు బేఖాత‌ర్ చేస్తున్నారు. వారి నిర్ల‌క్ష్య‌మే క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతోంది. తాజాగా తెలంగాణ‌లో న‌మోదైన కేసుల్లో ఓ సంచ‌లన విష‌యం తెలి‌సింది. లాక్‌ డౌన్ స‌మ‌యంలోనూ కొంద‌రు జ‌న్మ‌దిన వేడుక చేసుకున్నారు.. ఆ పార్టీ ద్వారా ఏకంగా 45 మందికి క‌రోనా సోక‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ ప‌రిధిలో జ‌రిగింది.

హైద‌రాబాద్ సరూర్‌ న‌గ‌ర్‌ లో ఓ దుకాణ య‌జ‌మానితో మ‌రో దుకాణ య‌జ‌మాని స్నేహితులు. ఇటీవల త‌న స్నేహితుడి జ‌న్మ‌దినం ఉండ‌డంతో పెద్ద ఎత్తున అత‌డి స్నేహితుడు బ‌ర్త్ డే పార్టీ ఏర్పాటుచేశాడు. అయితే అప్ప‌టికే త‌న దుకాణంలో ప‌ని చేసే వ్య‌క్తి ద్వారా య‌జ‌మానికి క‌రోనా సోకింది. అయితే ఆ విష‌యం అత‌డికి తెలియ‌దు. దీంతో బ‌ర్త్ డే గ్రాండ్‌ గా ఇచ్చాడు. దాదాపు 50-60మందిలోపు ఆ పార్టీకి వ‌చ్చారంట‌. దీంతో ఇరు స్నేహితుల కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొంద‌రు మిత్రులు హాజ‌ర‌య్యారు. అయిత ఆ ఇరు కుటుంబ‌స‌భ్యులు వారి ఇంటికి.. వీరి ఇంటికి ప‌ర‌స్ప‌రం రాక‌పోక‌లు చేస్తుంటారు. దీంతో ఆ ఇంటిల్లిపాదీకి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

అంద‌రికీ క‌లిపి ఏకంగా 45 మందికి క‌రోనా సోకిన‌ట్టుగా వైద్యాధికారులు గుర్తించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారే 25 మంది ఉన్నారు. దీంతో స‌రూర్‌ న‌గ‌ర్ ప్రాంతం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఇక మిగిలిన వాళ్లు వేర్వేరు కుటుంబాల వాళ్లు, వీళ్లంతా స‌రూర్ న‌గ‌ర్ ప్రాంతంలోనే నివ‌సించే వారే ఉన్నారు. క‌రోనా సోకిన విష‌యం తెలియ‌క వారు య‌థావిధిగా సాధార‌ణ జీవితం గ‌డిపారు. ఈ క్ర‌మంలో వారివ‌ల‌న మిగ‌తా వారికి సోకి ఉంటుంద‌ని తెలుస్తోంది. దీంతో మ‌రి ఇంకెంత మందికి క‌రోనా సోకి ఉంటుందోన‌ని అధికారుల‌తో పాటు ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ప్ర‌స్తుతం స‌రూర్‌ న‌గ‌ర్‌ లో పెద్ద సంఖ్య‌లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేశారు. ఒక్క పార్టీ ఎంత ప‌ని చేసిందో చూడండి. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో విందులు - వినోదాలు - శుభ‌కార్యాలు వ‌ద్ద‌ని అధికారులు మొత్తుకుంటున్నా విన‌క‌పోవ‌డంతో త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పటికైనా ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అధికారులు - ప్ర‌భుత్వం సూచిస్తోంది.