Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ నిందితులకు స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు?

By:  Tupaki Desk   |   13 Jun 2022 3:27 AM GMT
జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ నిందితులకు స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు?
X
హైదరాబాద్ పోలీసులకు ఈ మధ్యన టైం అస్సలు బాగున్నట్లుగా కనిపించట్లేదు. తరచూ చోటు చేసుకుంటున్న దారుణ నేరాలతో వారి నెత్తి బొప్పి కడుతున్న పరిస్థితి. పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా పరిస్థితి మారిందని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరగటం ఒక ఎత్తు అయితే.. బయటకు వస్తున్న సంచలన అంశాలు పోలీసులకు షాకుల మీద షాకులు ఇస్తున్న పరిస్థితి.

బాదితురాలి తరఫున ఉండాల్సిన పోలీసు అధికారులు.. నిందితులు వీవీఐపీ పిల్లలు కావటంతో వారిని తప్పించే దిశగా ప్రయత్నాలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో ఎమ్మెల్యే కొడుకు పాత్ర అసలేమీ లేదన్న ప్రచారం చేయటం.. బేకరీ వద్ద ఫోన్ కాల్ రావటంతో అతను వెళ్లిపోయినట్లుగా చెప్పటం తెలిసిందే. చివరకు బెంజ్ కారులో అతగాడు చేసిన అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో.. ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో చివరకు ఏ6 పేరును ఈ వ్యవహారంలో చేర్చటం తెలిసిందే.

తాజాగా జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ నిందితులను విచారణ కోసం పోలీసులు కస్టడీకి తీసుకోవటం తెలిసిందే. విచారణ వేళలో.. నిందితులకు హోటల్ నుంచి బిర్యానీలు తెప్పించిన వైనం ఇప్పుడు బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఆదివారం నిందితుల కోసం ఒక స్టార్ హోటల్ నుంచి బిర్యానీ పార్సిళ్లురావటం.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వటం కలకలాన్ని రేపింది. కస్టడీలో ఉన్న నిందితులను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత వారికి అవసరమైన ఫుడ్ కోసం స్టార్ హోటల్ నుంచి బిర్యానీ పార్సిళ్లు తెప్పించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. ఈ బిర్యానీలు తమ సిబ్బంది కోసం తెప్పించినట్లుగా ఒక అధికారి చెప్పే ప్రయత్నం చేస్తే.. మరో అధికారి మాత్రం లోగుట్టుగా అసలు విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిందితుల కోసమే తెప్పించిన వైనాన్ని ఒప్పుకోవటం గమనార్హం. నిందితులు సాధారణ భోజనం తినటానికి ఇష్టపడటం లేదని.. అందుకే బిర్యానీలు తెప్పించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సదరు పోలీసు అధికారి చెప్పిన మాటలు వింటే.. పీత కష్టాలు పీతవి.. సీత కష్టాలు సీతవన్న సామెత గుర్తుకు రాక మానదు.

''మైనర్ల విషయంలో నిబందనల్ని పక్కాగా పాటించాలి. ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే ఇబ్బంది. పోలీసుల కస్టడీలో ఉన్న వేళలో వారు పస్తులు ఉంటే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. అదే జరిగితే అది పోలీసులకే ఇబ్బంది. అందుకే బిర్యానీ తెప్పించటం రాచ మర్యాద కాదు. మమ్మల్ని మేం సేవ్ చేసుకోవాలి కదా. రేపొద్దున కోర్టులో మాపై వారు ఏదైనా ఆరోపణ చేస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ లెక్కలో చూసుకుంటే బిర్యానీ తెప్పించటం పెద్ద విషయమే కాదు' అని చెప్పటం గమనార్హం.

ఇదంతా సరే అనుకుందాం.. బిర్యానీ తెప్పించటం తప్పేం కాదు.. దాని కోసం స్టార్ హోటల్ ఎందుకు? చక్కగా ఉండే సాదాసీదా హోటల్ నుంచి తెప్పించొచ్చు కదా? అన్న ప్రశ్నకు మాత్రం పోలీసుల నుంచి సమాధానం రాని పరిస్థితి. విచారణ అంశం సున్నితంగా ఉండటం.. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకోకుండా ఉండేందుకు తీసుకున్న జాగ్రత్తలు.. ఇప్పుడు పోలీసులకు కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెట్టిందన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి ఈ గ్యాంగ్ రేప్ నిందితుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే లోపు మరెన్ని తలనొప్పులు మీద పడతాయో అంటూ పోలీసు అధికారులు హడలిపోతున్న పరిస్థితి.