Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ జైలు వెనుక బిష్ణోయ్ స‌మాజం

By:  Tupaki Desk   |   6 April 2018 4:52 AM GMT
స‌ల్మాన్ జైలు వెనుక బిష్ణోయ్ స‌మాజం
X
బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. అత‌డెంత ప‌వ‌ర్ ఫుల్ అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎంత ప‌వ‌ర్ ఉన్నా.. ఈ దేశంలో త‌ప్పు చేసిన వారు చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేర‌న్న విష‌యాన్ని నిరూపించారు బిష్ణోయ్. ఇంత‌కీ ఈ బిష్ణోయ్ ఎవ‌రు? అంటే.. రాజ‌స్థాన్ లోని వారికి త‌ప్పించి దేశంలోని మ‌రెవ‌రికీ వీరి గురించి పెద్ద‌గా తెలిసింది లేదు. ఇంకా చెప్పాలంటే.. స‌ల్మాన్ ఇమేజ్ ముందు వీరు అనామ‌కులు. అత‌డికి స్టార్ ఇమేజ్ ఉంటే.. వీరికి ప్ర‌కృతిని దేవ‌త‌గా కొలుస్తుంటారు. తాము న‌మ్మిన సిద్ధాంతం కోసం ఎవ‌రి మీద‌నైనా పోరాడ‌తారు. అందుకు ఎంతకూ త‌గ్గ‌ని మొండిత‌నం వారి సొంతం.

అప్పుడెప్పుడో వంద‌ల ఏళ్ల క్రితం త‌మ గురువు చెప్పింది నేటికీ న‌మ్ముతూ.. ప్ర‌కృతిని ఆరాధించే వీరు 29 సిద్ధాంతాల్ని తూచా త‌ప్ప‌కుండా పాటిస్తుంటారు. రాజ‌స్థాన్ లోని బిష్ణోయ్ స‌మాజానికి ప్ర‌కృతి అంటే ప్రాణం. చెట్లు.. కృష్ణ జింక‌లు వీరికి దైవంతో స‌మానం. 15వ శ‌తాబ్దంలో త‌మ గురువు జంభేశ్వ‌ర్ బిష్ణోయ్ సంప్ర‌దాయాన్ని స్టార్ట్ చేశారు. చెట్ల‌ను సంర‌క్షించ‌టం.. మూగ‌జీవాల్ని కాపాడ‌టం వారి సిద్ధాంతంలో భాగం. మ‌నుషుల మాదిరే మూగ‌జీవాల‌కు స‌మాన హ‌క్కులు ఉంటాయ‌ని.. ప్ర‌కృతిలో వారూ భాగ‌మేన‌ని న‌మ్ముతారు. చెట్టును వారెంత‌గా ప్రేమిస్తారంటే.. అందుకోసం త‌మ ప్రాణాల్ని సైతం ప‌ణంగా పెట్ట‌టానికి వెనుకాడ‌రు.

క్రీస్తుశ‌కం 1730లో జోధ్ పూర్ మ‌హ‌రాజు త‌మ ప్యాల‌స్ నిర్మాణం కోసం ఖేజ్రీ చెట్లు కొట్టేయాల‌ని ఆదేశించారు. వాటిని ఎంతో ప‌విత్రంగా పూజించే బిష్ణోయ్ లు రాజునే స‌వాల్ చేశారు. అమృతాదేవి మ‌హిళ అయితే త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి సైనికుల్ని అడ్డుకుంటూ చెట్ల‌ను కౌగిలించుకున్నారు. చెట్ల కోసం సైనికుల చేతిలో చ‌నిపోయారు. ఆమె బాట‌లోనే వంద‌లాది బిష్ణోయ్ పురుషులు.. మ‌హిళ‌లు.. పిల్ల‌లు ఖేజ్రీ చెట్ల‌ను కాపాడుకోవ‌టం కోసం త‌మ ప్రాణాల్ని వ‌దిలేశారు.

70ల‌లో స్టార్ట్ అయిన చిప్కో ఉద్య‌మం కూడా అమృత‌తాదేవి త్యాగ‌మే స్ఫూర్తిగా తీసుకొని పోరాడిన‌ట్లుగా చెబుతారు. ప‌ర‌మ శాఖాహారులైన బిష్ణోలు త‌మ దైనందిక అవ‌స‌రాల కోసం.. వంట కోసం సైతం చెట్ల‌ను న‌ర‌క‌రు. రాలి ప‌డిన పుల్ల‌ల్ని ఏరుకొని వంట చేసుకుంటూ ఉంటారు.

బిష్ణోయ్ మ‌హిళ‌లు అనాథ లేగ దూడ‌ల‌కు.. కృష్ణ జింక‌ల్ని త‌మ సొంత పిల్ల‌లుగా పెంచుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో వాటికి త‌మ చ‌నుబాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడ‌రు. స‌ల్మాన్ లాంటి స్టార్ హీరోతో త‌ల‌ప‌డే ధైర్యం.. అక్క‌డ నుంచి వ‌చ్చే ఒత్తిడిని వారెలా త‌ట్టుకున్నారంటే.. త‌మ గురువుకి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవ‌ట‌మే వారి ల‌క్ష్యం కావ‌టంతోనే.

ఆ మాట ఇచ్చింది నిన్న‌నో.. మొన్న‌నో కాదు.. దాదాపు 500 ఏళ్ల క్రితం గురువు జంభేశ్వ‌ర్ కి త‌మ పూర్వీకులు ఇచ్చిన మాట‌ను నేటికీ న‌మ్ముతూ సాగుతున్న వారి జీవ‌న‌శైలే స‌ల్మాన్ ను జైలుకు వెళ్లేలా చేసింది. ఈ దేశంలో చెట్లు.. వన్య‌ప్రాణుల్ని ర‌క్షించ‌టానికి బిష్ణోయ్ లాంటి వారున్నారు. వారే.. ఈ దేశ విల‌క్ష‌ణ‌త‌ను కాపాడుతున్నార‌ని చెప్పాలి. సెల్యూట్ బిష్ణోయ్‌. మీరు క‌ల‌కాలం వ‌ర్దిల్లాలి. అప్పుడే.. ప్ర‌కృతిలో మ‌నిషి ఒక భాగ‌మే త‌ప్ప‌.. మ‌రింకేమీ కాద‌న్న వాస్త‌వం గుర్తుంటుంది.