Begin typing your search above and press return to search.

అతడేనా బిట్ కాయిన్ సృష్టికర్త? మిస్టరీ వీడేదెప్పుడు?

By:  Tupaki Desk   |   8 Dec 2021 1:30 AM GMT
అతడేనా బిట్ కాయిన్ సృష్టికర్త? మిస్టరీ వీడేదెప్పుడు?
X
అర్థమైనట్లే ఉంటుంది.. అంతలోనే అర్థం కానట్లుగా ఉంటుంది. చెప్పేందుకు చాలానే ఉన్నా.. చెప్పటానికి వచ్చేసరికి మాత్రం ఎక్కువ చెప్పలేని అర్థం కాని మిస్టరీగా ఉండేదే బిట్ కాయిన్. గడిచిన కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటమే కాదు.. ఈ క్రిప్టో కరెన్సీకి క్రియేటర్ ఎవరన్నది ప్రపంచానికి ఒక పట్టాన వంట పట్టనిదిగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బిట్ కాయిన్ సృష్టికర్త ఎవరన్న విషయంపై ప్రపంచానికి ఒక స్పష్టత వస్తుందని భావించారు. కానీ.. అలాంటిదేమీ లేకుండా మళ్లీ మిస్టరీగా మారింది.

కరెన్సీ.. డిజిటల్ కరెన్సీ తర్వాత.. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన బిట్ కాయిన్ అలియాస్ క్రిప్టో కరెన్సీని రూపొందించిందెవరు? ఇప్పుడు మార్కెట్లో పలు రకాల క్రిప్టో కరెన్సీ ఉన్నా.. వాటన్నింటికి మూలం బిట్ కాయిన్ క్రియేటర్. అతగాడి మదిలో పుట్టిన ఈ సరికొత్త కరెన్సీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేస్తోంది. గడిచిన కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ధనవంతుల్ని అపర కుబేరులుగా చేయటంలో బిట్ కాయిన్ పాత్ర ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అమెరికాలో గడిచిన పది రోజులుగా సాగుతున్న ఒక కేసు విచారణ అందరిలో ఆసక్తిని రేకెత్తించటమే కాదు.. ఇంతకాలంగా మిస్టరీగా ఉన్న బిట్ కాయిన్ సృష్టికర్త ఎవరన్నది తేలుతుందని ఆశించారు. బ్యాడ్ లక్ ఏమంటే.. తేలిపోతుందని అందరూ భావించిన వేళలో.. ఏమీ తేలకుండా.. ఎప్పటిలానే మిస్టరీగా మారింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. బిట్ కాయిన్ ను సృష్టించింది తానేనని ఆస్ట్రేలియాకు చెందిన క్రేగ్ రైట్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్త 2016లో తనను తాను ప్రకటించుకున్నారు. చదివే వారి సౌలభ్యం కోసం ఇక్కడో చిన్న మార్పు చేస్తాం. క్రేగ్ పేరును కన్నారావుగా పిలుచుకుందాం. అప్పుడు విషయం చాలా త్వరగా అర్థం కావటమే కాదు.. ఈ మిస్టరీ ఇష్యూ మీద అవగాహన కూడా పెరుగుతుంది. అయితే.. కన్నారావు తన పేరుతో కాకుండా మొదట్నించి బిట్ కాయిన్ ను సతోషి నకమోటో పేరుతో ప్రచారం చేసుకున్నారు.

సతోషి నకమోటోను సంతోష్ గా పిలుచుకుందాం. అంటే.. బిట్ కాయిన్ క్రియేటర్ గా సంతోష్ పేరు ఉండేది. ఆ సంతోష్ ఎవరో కాదు తానేనని 2016లో కన్నారావు తనను తాను బిట్ కాయిన్ సృష్టికర్తగా పేర్కొన్నారన్నమాట. కన్నారావుకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతగాడి పేరు డేవిడ్ క్లేమన్. అతడికి డబ్ల్యూ అండ్ కే అనే సంస్థను నిర్వహించేవాడు. దాన్ని మన సౌలభ్యం కోసం దండుపాళ్యం కంపెనీగా చెప్పుకుందాం. అదే సమయంలో డేవిడ్ పేరును దుర్గారావుగా చదువుకుందాం.

ఇదిలా ఉంటే 2013లో ఈ దుర్గారావు అనుకోకుండా మరణించాడు. అతడి మరణం తర్వాతే బిట్ కాయిన్ క్రియేటర్ ఎవరు? వారి వద్ద ఉన్న వాటాల లెక్కల రచ్చ బయట ప్రపంచానికి తెలీటం మొదలైంది. కన్నారావు.. దుర్గారావు స్నేహితులని.. ఇద్దరు కలిసి మొదలు పెట్టిన బిట్ కాయిన్ వ్యాపారంలో తమకు సగం వాటా ఇవ్వాలని దుర్గారావు కుటుంబ సభ్యులు మియామీ కోర్టును ఆశ్రయించారు. వారి వాదన ప్రకారం.. కన్నారావు.. దుర్గారావులు ఇద్దరు 2007-08 మధ్య కాలంలో బిట్ కాయిన్ ను క్రియేట్ చేశారన్నది వారి వాదన.

ఇప్పుడు దుర్గారావు కుటుంబ సభ్యుల వాదన ప్రకారం కన్నారావు వద్ద 1.1 మిలియన్ల బిట్ కాయిన్లు ఉన్నాయని చెబుతారు. అంతే.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.3.75 లక్షల కోట్లు. ఇందులో 50 శాతం వాటా తమదేనన్నది దుర్గారావు కుటుంబ సభ్యుల వాదన. కన్నారావు వద్ద ఉన్న బిట్ కాయిన్ల తో పాటు.. దీనికి సంబంధించిన బ్లాక్ చైన్ సాంకేతికతపై మేథోహక్కులు కూడా కల్పించాలని వారు కోరుతున్నారు.

ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా ఈ బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుంటున్నా.. దాని వివరాలు.. దాని సాంకేతికత అర్థం కాని రాళ్ల గుగ్గిళ్ల మాదిరి ఉంటుంది. దీంతో.. దుర్గారావు కుటుంబ సభ్యులు మియామి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. వారు అసలీ బిట్ కాయిన్ వ్యవహారం ఏమిటి? దాని సాంకేతికత ఏమిటి? అసలీ బిట్ కాయిన్ ఎలా పని చేస్తుంది? లాంటి వివరాల్ని పది రోజుల పాటు విన్నారు. అవగాహన పెంచుకున్నారు. అదే సమయంలో.. కన్నారావు.. దుర్గారావు కుటుంబాల మధ్య ఉన్న బంధం ఏమిటో తెలుసుకొని.. అందుకు సంబంధించిన వివరాల్ని నిశితంగా పరిశీలించారు.

చివరకు కన్నారావు వద్ద ఉన్న 1.1 మిలియన్ల బిట్ కాయిన్లలో దుర్గారావు కుటుంబానికి వాటా లేదని తీర్పును ఇచ్చారు. అయితే.. మేథోపరమైన హక్కుల ఉల్లంఘనకు కన్నారావు.. దుర్గారావులు కలిసి పెట్టిన దండుపాళ్యం కంపెనీకి 100 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని కన్నారావును ఆదేశించారు. దీనిపై కన్నారావు సైతం హ్యాపీగా ఫీలయ్యారు. ఇక.. దండుపాళ్యం కంపెనీకి ఆనందమే ఆనందం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బిట్ కాయిన్ ను క్రియేట్ చేయటానికి అవసరమైన బ్లాక్ చెయిన్ సాంకేతికతకు సంబంధించిన మేథోహక్కుల్ని కన్నారావు ఉల్లంఘించినట్లుగా నిరూపితమైంది.

దీంతో దుర్గారావు కుటుంబానికి.. కన్నారావుకు మధ్యనున్న కేసు ఒక కొలిక్కి వచ్చినట్లైంది. నిజానికి ఈ కేసుతో బిట్ కాయిన్ అసలు సృష్టికర్త ఎవరన్నది తేలుతుందని భావించారు. కానీ.. ఆ మిస్టరీ తేలకుండానే.. ఆర్థిక వివాదం ఒక కొలిక్కి వచ్చింది. అయితే.. తన వద్ద భారీగా ఉన్నట్లుగా చెప్పే కన్నారావు మాటల మీదా కొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. కన్నారావు వద్ద అతను చెప్పుకున్నట్లుగా 1.1మిలియన్ బిట్ కాయిన్లు ఉండి ఉంటే.. వాటిని ఇంతకాలం ఎందుకు కదపకుండా ఉంటాడన్న సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు.

అంత భారీ బిట్ కాయిన్లు కన్నారావు దగ్గర ఉన్నప్పుడు.. వాటిని ట్రేడింగ్ లో ఎందుకు ఉంచనట్లు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి. ఈ సందర్భంగా కేసునను గెలిచిన కన్నారావును పలువురు కొన్ని సవాళ్లు విసురుతుంటారు. నిజంగానే అతని వద్ద 1.1 మిలియన్ బిట్ కాయిన్లు ఉండి ఉంటే.. వాటిల్లో కొన్నింటిని ఇతరుల ఖాతాల్లోకి మళ్లించి చూపాలని కోరుతుంటారు. దీనిపై కన్నారావు పెద్దగా స్పందించకపోవటం ఒక ఎత్తు అయితే.. బిట్ కాయిన్ అసలు క్రియేటర్ ఎవరన్నది ఇప్పటికి అంతుచిక్కనిదిగా ఉండిపోయింది.