Begin typing your search above and press return to search.

గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం

By:  Tupaki Desk   |   24 Nov 2020 12:50 PM GMT
గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం
X
గ్రేటర్ లో గులాబీలకు సెగ తగులుతోంది. ఐదేళ్లు జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటూ పలు చోట్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వరదలు, నష్టం, వరదసాయంపై టీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి హైదరాబాద్ లో కనిపిస్తోంది. దీంతో టీఆర్ఎస్ నేతలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే వారికి పలు చోట్ల నిరసన సెగలు తప్పడం లేదు. అసలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాదీలు ఎన్నికల ప్రచారం కోసం తమ ముందుకు వస్తున్న అధికార, ప్రతిపక్ష నేతలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లకు జీహెచ్ఎంసీలో చేదు అనుభవం ఎదురైంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఖైరతాబాద్ లోని చందానగర్ లో ప్రచారానికి మంత్రి గంగుల వెళ్లారు. తమకు వరద సాయం అందలేదని..వరదలతో కష్టాలు పడితే మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడంటూ స్థానికులు తిరగబడ్డారు. దీంతో చేసేదేం లేక మంత్రి గంగుల, ఎమ్మెల్యే దానం వెనుదిరిగారు.

ఇక ఉప్పల్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థిని నిలదీశారు ఓ మహిళ. ఇళ్లిళ్లు తిరిగుతూ ఓ షాప్‌కు వెళ్లారు ఉప్పల్ టీఆర్ఎస్‌ అభ్యర్థి అరటికాయల శాలిని భాస్కర్‌. ఆయన ముఖం మీదే తిట్టిపోసింది ఓ మహిళ.. ‘వరద సాయం పంచుకుతిన్నారు.. రూ. 25 లక్షలు.. రెండు గల్లీలకు చెందినవారే.. పెళ్లం, మొగుడు, కొడుకు ఇలా పంచుకుతిన్నారు. ఇక, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు’ అని ఆ మహిళ నిలదీసింది.. సాయం అందకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సముదాయించే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్‌ అభ్యర్థి. అయినా ఆ మహిళ వినకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు టీఆర్ఎస్‌ నేతలు.. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.