Begin typing your search above and press return to search.

ఈ వైసీపీ ఎమ్మెల్యే..రెండు రాష్ట్రాలకూ ఆదర్శప్రాయుడేనబ్బా!

By:  Tupaki Desk   |   11 April 2020 5:30 PM GMT
ఈ వైసీపీ ఎమ్మెల్యే..రెండు రాష్ట్రాలకూ ఆదర్శప్రాయుడేనబ్బా!
X
ప్రాణాంతక వైరస్ గా మారిన కోవిడ్-19పై ప్రపంచ దేశాలన్నీ అలుపెరగని పోరు సాగిస్తున్నాయి. అమెరికా - ఇటలీ - చైనా తదితర దేశాలతో పోలిస్తే.. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న భారత్ లోనూ కరోనాపై పోరు ఓ రేంజిలో సాగుతోంది. ఇలాంటి కీలక తరుణంలో ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఏపీతో పాటు తెలంగాణ.. ఇంకా చెప్పాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వైసీపీ ఎమ్మెల్యే మరెవరో కాదు... అసెంబ్లీలో తనదైన మాట తీరుతో సభలోని సభ్యులతో పాటు యావత్తు రాష్ట్రాన్ని నవ్వుల్లో ముంచేసిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డే. పాలనా పరమైన అంశాలపై అంతగా పట్టు లేదని తనకు తానే చెప్పేసిన ఈ రెడ్డి... ఆపదలో తన నియోజకవర్గ ప్రజలను ఎలా ఆదుకోవాలన్న విషయంలో మాత్రం అందరికీ ఆదర్శనీయుడిగా నిలిచారు.

అయినా కరోనా వేళ... బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏం చేశారన్న విషయానికి వస్తే... తన నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని కుటుంబాలకు ఆయన మాస్కులు - గ్లోవ్స్ - శానిటైజర్లను పంపిణీ చేశారు. నిజమా? అంటే... ముమ్మాటికీ నిజమేనని శ్రీకాళహస్తి వాసులే చెబుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కూడా మధుసూదన్ రెడ్డి... కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకునే ఈ మూడు రకాల వస్తువులను పంపిణీ చేశారు. అంతేకాదండోయ్... శనివారం తన నియోజకవర్గ పరిధిలోని 10 వేల నిరుపపేద కుటుంబాలకు 5 కిలోల బియ్యం - కూరగాయలు - పుచ్చకాయలను అందజేశారు. ఈ సందర్భంగానే ఆయన తన నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు మాస్కులు - శానిటైజర్లు - గ్లోవ్స్ ను పంపిణీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

వైసీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఈ తరహా సహాయక కార్యక్రమాలను చేపట్టినా... వారందరి కంటే ఓ అడుగు ముందుకేసిన మధుసూదన్ రెడ్డి కరోనాపై పోరులో కీలక వస్తువులుగా భావిస్తున్న మాస్కులు - శానిటైజర్లు - గ్లోవ్స్ ను తన నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు అందజేసిన వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. లాక్ డౌన్ ముగుస్తున్న తరుణంలో ఈయన పంపిణీ చేసిన ఈ మూడు వస్తువులు నియోజకవర్గంలో కరోనా ఎంట్రీకి గేట్లు వేయడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెడ్డిగారు చేపట్టిన పంపిణీ కూడా చాలా వెరైటీగానే సాగింది. ఏమాత్రం హంగూ ఆర్భాటం లేకుండా ఒక్కో గ్రామానికి పంపాల్సిన వస్తువులను ఒక్కో ట్రాక్టర్ లోకి ఎక్కించి వాటిని ఆయా గ్రామాలకు పంపించిన మధుసూదన్ రెడ్డి... అంతపెద్ద పంపిణీలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.