Begin typing your search above and press return to search.

బోణీ చేసిన బీజేడీ..వాకౌట్ చేసి మోదీకి సహకారం

By:  Tupaki Desk   |   20 July 2018 6:52 AM GMT
బోణీ చేసిన బీజేడీ..వాకౌట్ చేసి మోదీకి సహకారం
X
స్పష్టమైన మెజారిటీ బీజేపీకి ఉన్నందున అవిశ్వాసం నుంచి గట్టెక్కడం ఆ పార్టీకి పెద్ద సమస్యేమీ కాదు. పైగా తటస్థ పార్టీలు, పరోక్ష సహకారం అందించే పార్టీలు బీజేపీకి మరింత అనుకూలత కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అవిశ్వాసంపై చర్చ ఇంకా ప్రారంభం కావడానికి ముందే ఒడిశాలోని పాలక పార్టీ, నవీన్ పట్నాయిక్ కు చెందిన బిజూ జనతాదళ్ లోక్ సభ నుంచి వాకౌట్ చేసింది.

విపక్షాలకు మాట్లాడేందుకు ఇచ్చిన సమయం సరిపోదంటూ ఖర్గే మాట్లాడుతున్న వేళ, బీజేడీ పక్ష నేత భర్తృహరి మహతాబ్ తనకు మైక్ కావాలని తీసుకున్నారు. ఆపై ఆయన మాట్లాడుతూ, తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామరి, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. గత 14 సంవత్సరాల్లో.. యూపీయే పదేళ్ల పాలన, మోదీ నాలుగేళ్ల పాలనలో ఒడిశాకు న్యాయం జరగలేదని... దానిపై మాట్లాడకుండా ఇవన్నీ ఏంటంటూ తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

కాగా బిజూ జనతాదళ్‌కు లోక్ సభలో 20 సీట్లున్నాయి. అంతేకాదు...ప్రస్తుత సభలో అది అయిదో అతి పెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో బీజేడీ వాకౌట్‌తో సభ హాజరు తగ్గి బీజేపీకి అవిశ్వాస పరీక్షలో గెలవడం మరింత సులభం కానుంది. మరోవైపు శివసేన కూడా లోక్ సభకు రావడం లేదు. ఈ పార్టీకి నలుగురు ఎంపీలున్నారు.

అనంతరం స్పీకర్ అవిశ్వాస తీర్మానం పెట్టిన కేసినేని నానిని మాట్లాడాలని చెప్పగా ఆయన తనకు బదులుగా గల్లా జయదేవ్ ప్రసంగిస్తారని తెలిపారు. అందుకు స్పీకర్ అనుమతించారు. దాంతో గల్లా జయదేవ్ తన ప్రసంగాన్ని ప్రారంభించి విభజన నుంచి గత నాలుగేళ్లలో ఏం జరిగిందో చెప్పుకొంటూ వస్తున్నారు. రాష్ట్రంలో ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావాల్సిన అభివృద్ధి గురించి మరో ఎంపీ రామ్మోహన్ మాట్లాడతారని జయదేవ్ తెలిపారు.