Begin typing your search above and press return to search.

త‌మ్ముడి నోట‌..టాప్ త్రీ ఆంధ్రా ద్రోహుల మాట‌!

By:  Tupaki Desk   |   3 Oct 2018 4:43 AM GMT
త‌మ్ముడి నోట‌..టాప్ త్రీ ఆంధ్రా ద్రోహుల మాట‌!
X
తెలుగు త‌మ్ముళ్లు మాంచి హుషారుగా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మీద వ్య‌తిరేక‌త సెంటిమెంట్‌ ను రాజేసి.. ఆ పార్టీకి పుట్ట‌గ‌తులు లేకుండా చేసిన చందంగానే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో (2019) ఏపీలో బీజేపీకి అలాంటి శాస్తినే కుద‌ర్చాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అదే ప‌నిగా బీజేపీ మీద విరుచుకుప‌డుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో తాను ఒక్క‌డినే అయితే ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ తో ముఖాముఖిన త‌ల‌ప‌డే అవ‌కాశం లేక‌పోవ‌టం.. గ‌త ఎన్నిక‌ల్లో మిత్రులుగా ఉన్న బీజేపీ.. జ‌న‌సేన‌లు ఇప్పుడు ప్ర‌త్య‌ర్థులుగా మారిన నేప‌థ్యంలో కొత్త మిత్రుడి అవ‌స‌రం టీడీపీకి ఉంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాంగ్రెస్‌.. వామ‌ప‌క్షాలు త‌ప్పించి మ‌రెవ‌రూ అందుబాటులో లేరు. వామ‌ప‌క్షాలు సైతం బాబుపై గుర్రుగా ఉండ‌టంతో కాంగ్రెస్ త‌ప్పించి మ‌రో ఆప్ష‌న్ బాబుకు లేదు. అందుకే.. బీజేపీపై అదే ప‌నిగా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా.. ఆంధ్రోళ్ల‌లో ఆగ్ర‌హాన్ని పీక్స్ కు తీసుకెళ్లాల‌న్న‌ది బాబు అండ్ కో ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే.. బీజేపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం ద్వారా ఆంధ్రా ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హాన్ని పెంచేలా ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయి.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఏ విధంగా అయితే.. తెలంగాణ ద్రోహులంటూ ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించే మాట‌ల్ని చెప్పారో.. ఇప్పుడు అదే పంథాను ఫాలో అవుతున్నారు ఏపీ తెలుగుదేశం నేత‌లు. తెలంగాణ ఉద్య‌మంలో ఉద్య‌మ ద్రోహుల పేరుతో హ‌డావుడి చేయ‌టంతో పాటు ప్ర‌జ‌ల దృష్టి త‌మ మీద ప‌డేలా చేసిన చందంగానే ఏపీ టీడీపీ నేత‌ల నోట ఆంధ్రా ద్రోహుల మాట వ‌స్తోంది.

ఏపీ విప్ క‌మ్ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఆంధ్రా ద్రోహుల జాబితాను సిద్ధం చేశారు. ఆంధ్రాకు ద్రోహం చేసే టాప్ త్రీ ద్రోహుల జాబితాను తాజాగా ఆయ‌న వెల్ల‌డించారు. అందులో మొద‌టి స్థానం బాబుపై అదే ప‌నిగా అవాకులు చ‌వాకులు పేలే బీజేపీ సీనియ‌ర్ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు.. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. మ‌రో నేత సోము వీర్రాజుల పేర్ల‌ను వెల్ల‌డించారు. ఈ ముగ్గురు బీజేపీ నేత‌లు క‌లిసి ఏపీ సీఎం మీదా.. ఏపీ టీడీపీ స‌ర్కారు మీదా అసత్య ప్ర‌చారం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఏపీ నుంచి ఢిల్లీకి పైర‌వీల‌తో అధికారంలో ఉన్న పార్టీల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌ట‌మే జీవీఎల్ రోజువారీ చ‌ర్య‌గా ఆరోపించారు. అవినీతి కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న క‌న్నా కూడా అవినీతి గురించి మాట్లాడ‌తారా? అంటూ మండిప‌డుతున్న బుద్ధాకు.. టీడీపీ అధినేత‌.. ఏపీ సీఎం మీదా గ‌తంలో అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కేసులు న‌మోదైన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మొత్తంగా తెలంగాణ ఉద్య‌మ వేళ‌లో ప్ర‌జ‌ల భావోద్వేగాల్ని స్పృశించేలా ఉద్య‌మ‌కారుల నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీలో గ‌ళం విప్పుతున్న బుద్ధా మాట‌లు ఏపీ ప్ర‌జ‌ల‌పై ఏ మేర‌కు ప్ర‌భావితం చేస్తాయో చూడాలి.