Begin typing your search above and press return to search.

డ్యామేజ్ చేసే మాటను తెలివిగా తుంచేసిన ఈటల

By:  Tupaki Desk   |   11 Aug 2022 6:15 AM GMT
డ్యామేజ్ చేసే మాటను తెలివిగా తుంచేసిన ఈటల
X
అవసరానికి మించిన హైప్ ఎప్పుడూ పనికి రాదు. అదే సమయంలో ఆశ తప్పించి అత్యాశ కూడా ఉండకూదన్న వాస్తవాన్ని గుర్తించే నేతలకు ఎదురుదెబ్బలు ఉండవు. ఇప్పుడిప్పుడే పార్టీలో కుదురుకుంటున్న ఈటల రాజేందర్ ను దెబ్బ తీసే ప్రయత్నాలు బయట నుంచే కానీ బీజేపీలోనూ మొదలైనట్లుగా చెబుతున్నారు. అనూహ్య పరిస్థితుల్లో బీజేపీలోకి వచ్చిన రాజేందర్ మీద అధినాయకత్వానికి విశ్వాసం కలగటానికి చాలానే సమయం తీసుకుందని చెప్పాలి. ఆయన అవసరానికి వచ్చిన నేతగానే ప్రొజెక్టు అయ్యారు. కాస్త కుదురుకోగానే కాంగ్రెస్ లోకి వెళతారన్న ప్రచారం జరిగింది. నిజానికి ఈటలకు ఆ ఆలోచన లేకున్నా.. ఆయనపై ఆ తరహా ముద్ర వేసేందుకు పలువురు ప్రయత్నించారని చెప్పాలి.

అయితే.. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా బీజేపీ అధినాయకత్వం గుర్తించిందని చెబుతున్నారు. పలు శీల పరీక్షల అనంతరం.. పార్టీ విషయంలో ఆయనకున్నకమిట్ మెంట్ ను గుర్తించిన మోడీషాలు.. ఇటీవల చేరికల కమిటీలోనూ ఆయనకు ప్రాతినిధ్యం కల్పించటం ద్వారా ఆయనకు పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఏమిటన్న విషయంపై క్లారిటీ ఇచ్చారని చెప్పాలి.

ఇదిలా ఉంటే. . తాజాగా ఈటలపైన మరో ప్రచారం మొదలైంది. అదేమంటే.. ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ. జాతీయ పార్టీలు ఏవీ కూడా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అని ప్రకటించటం ఉండదు.

చాలా తక్కువ సందర్భాల్లోనూ అలాంటివి ఉంటుంది. ఎక్కడిదాకానో ఎందుకు.. యూపీని తొలిసారి సొంతం చేసుకునే వేళలో.. ఫలానా నేత ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ చెప్పింది లేదు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ యోగి ఆదిత్యానాథ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇలాంటి విషయాల్ని చూసిన ఏ నేత కూడా కాస్త తెలివి ఉన్నాసరే.. తొందరపడి తనకు తాను ముఖ్యమంత్రి అభ్యర్థినన్న మాట కాదుకదా.. ఆ మాటను ప్రచారం చేస్తానని తన మద్దతుదారులు చెప్పినా.. వారిస్తారు.. వద్దని గట్టిగా చెబుతారు. కానీ.. ఈటల విషయంలో అందుకు భిన్నమైన ప్రచారం జరగటం చూస్తే.. ఆయన మీద ఒక ప్లాన్ ప్రకారంగా దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతుందన్న విషయం అర్థమవుతుంది. ఈ కుట్ర కోణాన్ని గుర్తించిన ఈటల.. తాజాగా రియాక్టు అవుతూ.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థినని వస్తున్న వార్తల్లోనిజం లేదన్నారు.

బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. ఇక్కడ ఉన్న నేతలు.. కార్యకర్తలు పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉంటారన్నారు. పదవులు.. వ్యక్తులుగా నిర్ణయించుకోలేరని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తారన్నారు. తనను సీఎం అభ్యర్థిగా పలు పత్రికలు.. ఛానళ్లు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు చెప్పిన ఆయన తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండాను ఎగురవేయటమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇంత స్పష్టంగా ఈటల విషయాల్ని చెప్పిన తర్వాత కూడా ఆయన మీద అదే తరహా ప్రచారం జరుగుతుందా? లేదంటే మారుతుందా? అన్నది చూడాలి.