Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ పై బీజేపీ : అయిననూ తెగనమ్ముతామంతే...?

By:  Tupaki Desk   |   26 July 2022 8:11 AM GMT
స్టీల్ ప్లాంట్ పై బీజేపీ : అయిననూ తెగనమ్ముతామంతే...?
X
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది నిన్నటి మాట. విశాఖ ఉక్కు అమ్మడం కేంద్రానికి ఉన్న నూరు శాతం హక్కు. ఇది నేటి మాట. విశాఖ ఉక్కు లాభాలు తేనీ, టర్నోవర్ విషయంలో రికార్డులు తిరగరాయనీ. మరేమైనా జరగనీ. కానీ తెగనమ్మేయడమే. నో వే. ఇది బీజేపీ విధానం. ఇదే బీజేపీ ఎంచుకున్న మార్గం. దానికి ఆ పార్టీ వారు ముద్దుగా చెబుతున్న మాట పాలసీ అని.

విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం మనసేంటో మాటేంటో తెలుసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ప్రశ్న సంధించారు. దానికి క్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే రాతపూర్వకంగా జవాబిస్తూ చాలా ఆసక్తికరమైన విషయాన్నే చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం 2017-18లో 16,618 కోట్ల వార్షిక టర్నోవర్‌ నమోదు చేసిందని స్వయంగా కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు. అంతే కాదు, 2021-22లో 28,214 కోట్ల టర్నోవర్ సాధించిందని కూడా పేర్కొన్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే విశాఖ ఉక్కు లాభాల బాటలో ఉందని కేంద్రమే అంగీకరించి నట్లు అయింది. అంతే కాదు విశాఖ ఉక్కు సత్తా కూడా ఆ విధంగా యావత్తు దేశానికి తెలిసింది. మరి విశాఖ ఉక్కు లాభాలలో ఉంది కదా అని దాన్ని ప్రైవేట్ పరం చేసే ఆలోచన మానుకుంటారా అంటే ఆ ఒక్కటి మాత్రం అసలు అడగకూడదు, విశాఖ ఉక్కుని అమ్మేయడమే కేంద్రం లక్ష్యమని అంటున్నారు.

నిజానికి విశాఖ ఉక్కు 2021-22లో 28,214 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్‌ సాధించింది అంటే దానికి ముందు ఏడాది 2020-21లో సాధించిన టర్నోవర్‌తో పోలిస్తే 57 శాతం వృద్ధి సాధించినట్లు లెక్క.

ఇది స్వయాన ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే చెప్పిన విషయం. మరి ఏ ఏటికి ఆ ఏడి ఇంతలా విశాఖ ఉక్కు లాభాలను గడిస్తూంటే ఎవరైనా అమ్ముకుంటారా. కానీ కేంద్రం మాత్రం మనసు కరగదు అంటోంది. అమ్మేసి తీరుతామని చెబుతోంది.

ఈ పరిస్థితుల్లో ఏపీ జనాలే కాదు, విశాఖ ఉక్కు కార్మికులు కూడా మండిపోతున్నారు. లాభాలు లేకపోతే ఓకే అనుకోవచ్చు. ఇంతలేసి లాభాలు కళ్ళచూపుతున్నా అమ్మేయడమేంటి, ఎందుకీ పంతం, విశాఖ ఉక్కుకు ఏమిటీ పాపం అని నిలదీస్తున్నారు. తాను ప్రాణాలు ఒడ్డి అయినా విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి కేంద్రం వర్సెస్ విశాఖ ఉక్కు కార్మిక సంఘం అన్నట్లుగా సీన్ ఉంది. ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి.