Begin typing your search above and press return to search.

దూకుడు పెంచి బీజేపీ.. తెలంగాణలో పలువురిపై ఆకర్ష్ అస్త్రం

By:  Tupaki Desk   |   20 May 2022 5:30 AM GMT
దూకుడు పెంచి బీజేపీ.. తెలంగాణలో పలువురిపై ఆకర్ష్ అస్త్రం
X
గడిచిన కొద్ది రోజులుగా పెరుగుతున్న మైలేజీని పూర్తి స్థాయిలో వాడుకునే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ అధినాయకత్వం. దక్షిణాదిన కర్ణాటక తర్వాత అధికారంలోకి అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన మోడీషాలు.. ఇప్పుడు తమ ఆపరేషన్ ను షురూ చేశారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మొదట్లో ముందస్తు ఎన్నికలకు తెర లేచే అవకాశం ఉన్నందున.. తెలంగాణ బీజేపీపై మరింత ఫోకస్ పెడుతున్నారు మోడీషాలు.

ఇందులో భాగంగా తరచూ తెలంగాణకు వచ్చేలా వారి కార్యక్రమాలు ఉండనున్నట్లు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. మే చివరి వారంలో హైదరాబాద్ కు ప్రధానమంత్రి మోడీ రానున్నారు. ఐఎస్ బీలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని వస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. ఆయన ఏదైనా రాష్ట్రం మీద టార్గెట్ పెడితే.. అందుకు తగ్గట్లే.. ఆ రాష్ట్రానికి తరచూ రావటం.. ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా బిల్డప్ ఇస్తూనే.. తెర వెనుక పార్టీ కార్యకలాపాల్ని మరింత వేగవంతంగా కదిలించే ప్రయత్నం చేయటం తెలిసిందే.

ఇదే ఫార్ములాను తాజాగా తెలంగాణలోనూ అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన పలువురు బలమైన నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో పార్టీలో సంస్థాగతంగా ఉన్న లోపాల్ని చక్కదిద్దాలని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణ బీజేపీ అధినాయకత్వంలో కొన్ని లుకలుకలు ఉన్న నేపథ్యంలో.. వాటిని సెట్ చేయాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉందంటున్నారు. ఇక.. ఆకర్ష్ అస్త్రాన్ని ఎవరెవరి మీద సంధించాలన్న దానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లుగా చెబుతున్నారు.

తమ ఆకర్ష్ అస్త్రాన్ని అధికార టీఆర్ఎస్ మీద కంటే కూడా విపక్ష కాంగ్రెస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం.. ప్రధాన విపక్షాన్ని బలహీన పర్చటం ద్వారా.. అధికరపక్షం తప్పించి మరెవరూ తమకు ప్రత్యర్థులుగా ఉండకూడదన్నది బీజేపీ ప్లానింగ్ అని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే.. మాజీ ఎంపీ.. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన.. అక్కడ నుంచి తిరిగి రాగానే బీజేపీలో చేరే అవకాశం ఉందంటుననారు.

అదే విధంగా కాంగ్రెస్ అసంత్రప్త నేతగా సుపరిచితులైన కోమటిరెడ్డి బ్రదర్స్ మీదా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు. అవీరిద్దరిలో ఎక్కువగా రాజగోపాల రెడ్డి మీదనే ఫోకస్ ఉందని.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయమంటున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నేతపైనా బీజేపీ అధినాయకత్వం ఆకర్ష్ అస్త్రాన్ని సంధించినట్లుగా చెబుతున్నారు. ఇక.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం బీజేపీ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. కొత్త రక్తాన్ని పార్టీలోకి ఎక్కించటం ద్వారా.. తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించాలన్నదే బీజేపీ లక్ష్యంగా చెబుతున్నారు. ప్లానింగ్ బాగానే ఉన్నా.. అమలు ఎలా ఉంటుందన్నది చూడాలి.