Begin typing your search above and press return to search.

పవన్‌-చంద్రబాబు భేటీ.. బీజేపీ అప్రమత్తం!

By:  Tupaki Desk   |   20 Oct 2022 10:03 AM GMT
పవన్‌-చంద్రబాబు భేటీ.. బీజేపీ అప్రమత్తం!
X
ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు ఎవరి ఊహకందని విధంగా సాగుతున్న సంగతి తెలిసిందే. విశాఖలో పవన్‌ పర్యటనను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం, మంగళగిరిలో జనసేనాని పవన్‌ ఉగ్రరూపం, చంద్రబాబు–పవన్‌ను కలసి మద్దతు ప్రకటించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.

దీంతో వచ్చే ఎన్నికల్లో మరోమారు జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీ అప్రమత్తమైంది. ఆ పార్టీ ఏపీ వ్యవహారాల కోఇన్‌చార్జ్‌ సునీల్‌ ధియోధర్‌ దీనిపై స్పందించారు. పవన్‌ కల్యాణ్‌తో వచ్చే ఎన్నికల్లో తమ ప్రయాణం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలని, వాటితో తాము కలవబోమని కుండబద్దలు కొట్టారు.

జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని.. ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ రెండు కుటుంబ పార్టీలని.. అందులో ఒకటి నాగరాజు అయితే, మరొకటి సర్పరాజు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ దొంగ పార్టీలని సునీల్‌ ధియోధర్‌ తీవ్ర విమర్శలు చేశారు.
కుటుంబ, అవినీతి పార్టీలపై బీజేపీ ఇప్పటికే పోరాటం చేస్తోందని గుర్తు చేశారు.

విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు ఇప్పటికే చాలా మంది పవన్‌తో మాట్లాడారని.. సంఘీభావం కూడా సునీల్‌ ధియోధర్‌ వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ బీజేపీ తనకు రోడ్‌ మ్యాప్‌ లేదని చెప్పినదానిపైన కూడా సునీల్‌ ధియోధర వివరణ ఇచ్చారు. రోడ్‌ మ్యాప్‌ విషయంలో తనకు ఎలాంటి గందరగోళం లేదన్నారు.

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రపక్ష నేత అయిన పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు కలవటాన్ని బీజేపీ స్వాగతిస్తోందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్‌ షా కాన్వాయ్‌ పైన జరిగిన రాళ్ల దాడిని సోము వీర్రాజు ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం. చంద్రబాబు తన హయాంలో జరిగిన ఘటనలు గుర్తుంచుకోవాలని సోము వీర్రాజు ఆయనకు సూచించడం గమనార్హం. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడే ముందు చంద్రబాబు నాటి సంగతులన్నీ గుర్తు చేసుకోవాలన్నారు.

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై సోము వీర్రాజు హాట్‌ కామెంట్స్‌ చేశారు. కన్నా వ్యాఖ్యలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.