Begin typing your search above and press return to search.

బీజేపీకి చెప్పాకే ఈసీ నిర్ణ‌యం తీసుకుంటుందా?

By:  Tupaki Desk   |   27 March 2018 8:26 AM GMT
బీజేపీకి చెప్పాకే ఈసీ నిర్ణ‌యం తీసుకుంటుందా?
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల ఒక వివాదంగా మారింది. ద‌క్షిణాదిన పాగా వేయాల‌ని త‌హ‌త‌హ లాడుతున్న బీజేపీ.. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఇప్పటికే ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌టంతోపాటు.. త‌ర‌చూ ప్ర‌ధాని మోడీ క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారంటే చాలు..ఆ రాష్ట్రం మీద మోడీ ఫోక‌స్ పెట్ట‌టం.. ప‌దే ప‌దే ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించటం ఒక అల‌వాటు. ఎన్నిక‌ల షెడ్యూల్ ముందే ఈ ప‌ని చేయ‌టం ద్వారా.. స‌ద‌రు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మోడీ చాలా ప‌రిచ‌య‌స్తుడిగా.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయ‌న ఎంతో త‌పిస్తున్న భావ‌న క‌లుగ‌జేస్తుంటారు.

ఇదే తీరును క‌ర్ణాక‌ట‌లోనూ మోడీ ప్ర‌ద‌ర్శించారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. మొన్న సాధార‌ణ‌ బ‌డ్జెట్ లోనూ క‌ర్ణాట‌క‌కు పెద్ద‌పీట వేయ‌టం.. బెంగ‌ళూరు మెట్రోకు వేలాది కోట్ల రూపాయిల కేటాయింపుల మాట చెప్ప‌టం తెలిసిందే. ఇదంతా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ల‌బ్థి పొందేందుకేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌ర్ణాట‌క అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేశారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడో వివాదంగా మారింది. ఎందుకంటే అధికారికంగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల తేదీతో పాటు.. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి.. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎప్పుడు వెల్ల‌డ‌వుతాయ‌న్న విష‌యాన్ని బీజేపీ త‌న సోష‌ల్ మీడియా విభాగంలో వెల్ల‌డించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఈసీ ఆలోచ‌న‌ను బీజేపీ ముందే ఊహించిందా? అన్న కోణంలో ప‌లువురు విశ్లేషిస్తున్న‌ప్ప‌టికీ.. ఒకేలాంటి తేదీల్ని ఊహించ‌టం అంత తేలికైన ముచ్చ‌ట కాద‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈసీ వెల్ల‌డించిన తేదీల్ని ఈ రోజు ఉద‌య‌మే బీజేపీ త‌న సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించ‌టం చూస్తే.. ఈసీ తాను చేసే కీల‌క ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన అధికారిక స‌మాచారాన్ని ముందే పంచుకుంటుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మే 12న పోలింగ్ జ‌రుగుతుంద‌ని.. మే 18న ఫ‌లితాలు వెల్ల‌డి అవుతాయ‌ని బీజేపీ జాతీయ ఐటీ శాఖ ఇన్ ఛార్జ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేయ‌టంపై పెను దుమారం రేగుతోంది. ఈసీ ప్ర‌క‌ట‌న‌కు ముందే బీజేపీకి ఈ విష‌యాలు ఎలా తెలిసాయి అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఈ తీరును త‌ప్పు ప‌డుతున్నారు. ఈసీ ఆలోచ‌న‌ల్ని బీజేపీ ముందే ఎలా ప‌సిగ‌ట్టింది? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. దీనికి ఈసీ ముందే స‌మాచారం ఇవ్వ‌టం ఒక స‌మాధానం.. లేదంటే.. జ‌రిగే విష‌యాల్ని ముందే ప‌సిగ‌ట్టే అద్భుత‌మైన అతీంద్రీయ శ‌క్తులు బీజేపీకి వ‌చ్చి ఉండాలి.