Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నిక: తెర వెనుక చక్రం తిప్పే వారిపై క్లారిటీ

By:  Tupaki Desk   |   13 Jun 2022 4:42 AM GMT
రాష్ట్రపతి ఎన్నిక: తెర వెనుక చక్రం తిప్పే వారిపై క్లారిటీ
X
షెడ్యూల్ ముందే తెలిసినా.. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా.. సమయం దగ్గరకు వచ్చినంతనే రంగంలోకి దిగిపోతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం కావటం తెలిసిందే.

ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావటం.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సైతం మరో రెండు రోజుల్లో (జూన్ 15) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ.. కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ఎవరిని బరిలోకి దింపుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అభ్యర్థుల మీద క్లారిటీ రాక ముందే.. రెండు జాతీయ పార్టీలు తమదైన శైలిలో ప్రయత్నాలు షురూ చేశాయి. ఎన్డీయే.. యూపీఏ పక్షాలు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు మొదలు పెడితే.. ఈ ఇద్దరికి తీసిపోని రీతిలో బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం రంగంలోకి దిగారు. తాము ప్రకటించే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు సీనియర్ నేతలకు ప్రత్యేక బాధ్యతల్ని అప్పజెప్పారు.

అధికార బీజేపీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు బీజేపీ అధినాయకత్వం బాధ్యతలు అప్పగిస్తే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మల్లిఖార్జున ఖర్గేను ఎంపిక చేశారు.

ఈ ముగ్గురు ప్రస్తుతం తమతో కలిసి వచ్చే భావసారూప్య పార్టీలను ఎంపిక చేసే బాధ్యతల్నిచేపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగారు. రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొన్ని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి.. రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా 22 మంది విపక్ష నేతలకు మమతా బెనర్జీ లేఖ రాశారు. తమ పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వీలుగా జూన్ 15న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ నేతలందరితో భేటీ కావాలని డిసైడ్ అయ్యారు. ఎవరికి వారుగా చేస్తున్న ఈ ప్రయత్నాల్లో ఎవరు ముందుకు వెళతారు? ఎవరు వెనుకబడతారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మరో రెండు.. మూడు రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు.