Begin typing your search above and press return to search.

బీజేపీ - పీకే ఉమ్మ‌డి వ్యూహం!..మ‌రో విభ‌జ‌నేనా?

By:  Tupaki Desk   |   28 Jun 2018 2:30 PM GMT
బీజేపీ - పీకే ఉమ్మ‌డి వ్యూహం!..మ‌రో విభ‌జ‌నేనా?
X

ఏపీలో ఇప్పుడు స‌రికొత్త రాజ‌కీయం తెర మీద‌కు వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. మ‌రో ఏడాదిలో అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి బాట‌లు వేసిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇప్పుడు టీడీపీకే ఎదురు వెళుతున్నారు. అధికారం అంద‌జేసిన త‌న‌ను టీడీపీ న‌ట్టేట ముంచేసింద‌ని కాస్తంత ఆల‌స్యంగా గ్ర‌హించిన ప‌వ‌న్‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి చుక్క‌లు చూపిస్తానంటూ కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేస్తున్నారు. అదే స‌మ‌యంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసిన బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీకి వైరివ‌ర్గంగా మారిపోయింది. ఈ రెండు పార్టీల మ‌ధ్య స్నేహం చేడిపోవ‌డానికి కార‌ణ‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ది మొద‌ట చంద్ర‌బాబే అయినా... ఇప్పుడు బీజేపీ కూడా చంద్ర‌బాబుకు త‌న బ‌ల‌మెంతో చూపించాల్సిందేన‌న్న క‌సితో ఉన్నట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

కొత్త పార్టీగా జ‌న‌సేన‌ - ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేని పార్టీగా బీజేపీ... ఏపీలో టీడీపీకి పెద్ద‌గా దెబ్బ కొట్టే ప‌ని అయితే చేసే ప‌రిస్థితి లేద‌న్న వాద‌నైతే వినిపిస్తోంది గానీ... బ‌ల‌మైన విప‌క్షం వైసీపీ దూసుకెళుతున్న నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల స‌హాయ నిరాక‌ర‌ణ‌తో టీడీపీ జ‌రిగే న‌ష్టం చంద్ర‌బాబుకు నిజంగానే చుక్క‌లు చూపించ‌నుంద‌న్న మాట అయితే బ‌లంగానే వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇటు జ‌న‌సేన - అటు బీజేపీలు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేవ‌న్న విష‌యాన్ని ఆ రెండు పార్టీలు ఇప్ప‌టికే గ్ర‌హించేశాయ‌న్న వాద‌న కూడా ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిపోయింది. మ‌రి విష‌యం తెలిసి కూడా ఆ రెండు పార్టీలు ఎందుకు దూకుడు పెంచేస్తున్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే... ఆస‌క్తికే ఆస‌క్తి క‌లిగించే ఓ కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంది. అదే న‌వ్యాంధ్ర‌ను కూడా ముక్క‌లుచెక్క‌లు చేసే వ్యూహ‌మ‌ట‌. నిజ‌మా? అంటే... ఇటు ప‌వ‌న్‌ తో పాటు అటు బీజేపీ నేత‌లు చేస్తున్న వ‌రుస ప్ర‌క‌ట‌న‌లను కాస్తంత లోతుగా ప‌రిశీలిస్తే మాత్రం... ఈ మాట నిజ‌మేన‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు.

ఈ విష‌యంలో కాస్తంత ముందుగా వ్యూహానికి ప‌దును పెట్టిన పార్టీగా బీజేపీని చెప్పుకోవాలి. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌ని బీజేపీకి గుణ‌పాఠం నేర్పండంటూ టీడీపీ స‌ర్కారు చేస్తున్న ప్ర‌చారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగా న‌వ్యాంధ్ర‌లో రాయ‌ల‌సీమ‌కు టీడీపీ సర్కారు చేసిందేమిటో చెప్పాలంటూ కొత్త ప్ర‌శ్న‌ల‌ను సంధించేసింది. ఈ మాట‌కు టీడీపీ నుంచి పెద్ద‌గా స‌మాధానం లేని వైనం బీజేపీకి మ‌రింత‌గా బ‌లం ఇచ్చిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ వెనుక‌బాటుకు టీడీపీ స‌ర్కారే కార‌ణ‌మ‌న్న విష‌యాన్ని మ‌రింత‌గా ప్ర‌చారం చేసే ప‌నిలో ప‌డిన బీజేపీ... ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే భ‌విష్య‌త్తులో ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ ఉద్యమం రాక త‌ప్ప‌దంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. స‌రిగ్గా ఇదే త‌రుణంలో మొన్న‌టిదాకా టీడీపీకి మిత్రుడిగా ఉండి... పార్టీ ఆవిర్భావ స‌భా వేదిక‌పై నుంచి ఒక్క‌సారిగా ఎదురు తిరిగిన జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్... ఉత్త‌రాంధ్ర కేంద్రంగా వ్యూహానికి ప‌దును పెడుతున్నారు.

శ్రీ‌కాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ స‌మ‌స్య‌పై అప్పుడెప్పుడో చేసిన పోరాటంతో ప‌వ‌న్ కు అక్క‌డ మంచి మైలేజీ వ‌చ్చింది. దీనినే ఆస‌రా చేసుకున్న ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర కేంద్రంగానే త‌న రాజ‌కీయాన్ని న‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో భాగంగా బీజేపీ మాదిరే ప‌వ‌న్ కూడా ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు త‌నాన్ని తెర‌మీద‌కు తెస్తున్నారు. ఉత్తరాంధ్ర‌ను నిర్ల‌క్ష్యం చేస్తే... భవిష్య‌త్తులో ఉత్త‌రాంధ్ర వాసులు ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఉద్య‌మించ‌క త‌ప్ప‌ద‌ని కూడా ప‌వ‌న్ నిన్న కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ప్ర‌స్తుతం విశాఖ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌... నిన్న‌టి త‌న వ్యాఖ్య‌ల‌తో తాను కూడా బీజేపీ బాట‌లోనే ప‌య‌నిస్తున్నార‌న్న అనుమానాల‌ను రేక‌రెత్తించారు. మొత్తంగా బీజేపీ - జ‌న‌సేన‌... వ్యూహాత్మ‌కంగా న‌వ్యాంధ్ర‌లో విభ‌జ‌న ఉద్య‌మాలు మొద‌ల‌య్యేలా పావులు క‌దుపుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.