Begin typing your search above and press return to search.

బీజేపీ ఎత్తుగడ.. కాపునేత ముద్రగడ.. కండీషన్స్ మాటేమిటి?

By:  Tupaki Desk   |   19 Jan 2021 3:30 PM GMT
బీజేపీ ఎత్తుగడ.. కాపునేత ముద్రగడ.. కండీషన్స్ మాటేమిటి?
X
తెలంగాణలో బీజేపీ వేళ్లు ఎంతగా నాటుకున్నాయన్నది తెలియదుగానీ.. కొంత ఊపయితే వచ్చిందాపార్టీకి. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. దీంతో.. అక్కడ కూడా పార్టీలో కదలిక తేవాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి గాలం వేస్తోంది. ఆయనతో ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు భేటీ అయ్యారు. వారు చెప్పిన మాటలను బట్టి ముద్రగడకు కాషాయ తీర్థం పట్టించాలని ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమైంది. అయితే.. ఆ ప్రయత్నం ఎంత వరకు వచ్చింది? బీజేపీలో చేరేందుకు ముద్రగడ సుముఖంగా ఉన్నారా? ఆయన పెట్టిన షరతులు ఏంటి? అన్నవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ప్రశ్నలు.

ఆ సామాజిక వర్గంపై చూపు..
ఏపీలో జనాభా పరంగా కాపు సామాజికవర్గం బలంగానే ఉంటుంది. ముందుగా వారిని తమవారు అనిపించుకుంటే.. మిగిలిన వారిని ఇతర మార్గాల ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. ఇందులో భాగంగానే జనసేనకు అండగా ఉంటోందని టాక్. ఒకవేళ రేపు ఏదైనా కారణంతో జనసేన దూరం జరిగితే.. కాపు సామాజికవర్గం ఓటర్లు జారిపోకుండా ముద్రగడను చేతిలో ఉంచుకుంటోందన్నది విశ్లేషకుల మాట. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లిన ముద్రగడ.. తనపై సోషల్‌ మీడియాలో వచ్చిన ఆరోపణలకు మనస్తాపం చెంది నాయకత్వం నుంచి వైదొలిగారు. అయితే.. బీజేపీలో చేరేందుకే ఇలా చేశారనే చర్చ సాగింది. ఇప్పుడు ఎలాగైనా కాషాయ కండువా కప్పాలని బీజేపీ భావిస్తోంది.

ప్రధాన హామీ అదేనా..?
ముద్రగడ బీజేపీలో చేరితో రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం సాాగుతోంది. ఈ విషయంలో నమ్మకం కుదర్చడానికి RSS సీనియర్‌ నేతతో మాట్లాడించారట సోము వీర్రాజు. గతంలో ఆంధ్రప్రాంతంలో పనిచేసిన ఆ సంఘ్‌ నేతతో గతంలోనే ముద్రగడతో పరిచయం ఉంది. పద్మనాభం కూడా ఒకప్పుడు బీజేపీలో పనిచేశారు. ఆ సమయంలో కాకినాడ నుంచి సినీ నటుడు కృష్ణంరాజును బీజేపీ ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారనే పేరుంది.

లిఖిత పూర్వకంగా కోరారా?
అయితే.. ముద్రగడ ఏ పార్టీలో చేరాలనుకున్నా కాపులకు ఏం చేస్తారో చెప్పాలని లిఖిత పూర్వక హామీ కోరతారట. తాజా.. భేటీలోనూ ఇదే అడిగారని సమాచారం. పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న కాపుల రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని, అది చేస్తే అట్టహాసంగా బీజేపీలో చేరతానని అన్నారట కాపునేత. అంతేకాకుండా.. కోస్తాలో తన అనుచరవర్గానికి ఎన్నికల్లో కొన్ని టికెట్లు కోరే అవకాశం కూడా ఉందట. ఇలా మరికొన్ని షరతులు కూడా ఉన్నాయట. మరి.. వీటికి బీజేపీ ఓకే అంటుందా? ముద్రగడ బీజేపీలో చేరతారా లేదా? అన్నది చూడాలి.