Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను గెలిపించటం కోసం బీజేపీ.. షర్మిల అంత కష్టపడుతున్నాయా?

By:  Tupaki Desk   |   13 July 2021 5:04 AM GMT
కేసీఆర్ ను గెలిపించటం కోసం బీజేపీ.. షర్మిల అంత కష్టపడుతున్నాయా?
X
తెలంగాణ ఉద్యమం నాటినుంచి ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. రాజకీయంగా కావొచ్చు.. వ్యక్తిగతంగా కావొచ్చు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఒక్కమాట అనేందుకు రాజకీయ పక్షాలు ముందు వెనుకా ఆలోచించేవి. దీనికి కారణం.. కేసీఆర్ ను ఏమన్నా సరే.. తెలంగాణను.. తెలంగాణ సెంటిమెంట్ ను దెబ్బ తీసినట్లుగా చిత్రీకరించే విషయంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారు. ఈ కారణంతో తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లుగా ఉండేది. ఇదంతా ఎందుకంటే.. కేసీఆర్ పొలిటికల్ ప్లానింగ్ ఎంతలా ఉంటుందన్నది ఈ విషయాన్ని చూస్తేనే అర్థమవుతుంది.

ఉద్యమ సమయంలోనే కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇదే తీరును కొనసాగించటం విశేషం. సాధారణంగా అధికారంలో ఉన్న వారు ప్రత్యర్థుల విమర్శలు.. ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా పవర్లో ఉన్న కేసీఆర్ ను పల్లెత్తు మాట అనేందుకు సైతం ఆలోచించి మాట అనాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసుకోవటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. సుతిమెత్తటి విమర్శలతో పాటు.. తప్పుల్ని ఎత్తి చూపించి మరీ వేలెత్తి చూపించే ఉద్యమ నేత.. తెలంగాణ ఏర్పాటులో కీలకభూమిక పోషించిన కోదండం మాష్టారు మాటలకు సైతం విలువ లేకుండా చేయటంలో ఆయన విజయవంతం అయ్యారు.

అలాంటి కేసీఆర్ ను జంకుబొంకు లేకుండా విమర్శలు చేయటం.. ఆయన తీరును ఘాటుగా విమర్శించటం అంత తేలికైన విషయం కాదు. అలాంటిది కొత్తగా పార్టీ పెట్టేసిన షర్మిల.. తనకున్న పరిమితులకు మించి మరీ ఘాటు వ్యాఖ్యల్ని చేయటం అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. కేసీఆర్ మీదా.. ఆయన ప్రభుత్వం మీదా షర్మిల చేస్తున్న ఘాటు విమర్శలపై టీఆర్ఎస్ అధినేత మొదలు గులాబీ నేతలు.. కార్యకర్తలు ఎవరూ కూడా పల్లెత్తు మాట అనని వైనం ఆసక్తికరంగా మారింది. గతంలో జనసేన పార్టీని ఏర్పాటు చేసే సమయంలో పవన్ కల్యాణ్.. కేసీఆర్ మీదా.. ఆయన కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. పెను దుమారాన్ని రేపాయి.

వాటిపై సీఎం కేసీఆర్ సైతం స్పందించటం గుర్తుండే ఉంటుంది. షర్మిల విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనటం గమనార్హం. అధికారికంగా పార్టీని పెడుతున్నట్లు ప్రకటించింది మొన్ననే అయినా.. అందుకు సంబంధించిన కసరత్తు.. ప్రకటన లాంటివి నాలుగు నెలల క్రితమే మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ పై షర్మిల ఘాటు విమర్శలు చేయటం మొదలు పెట్టిన తర్వాత గులాబీ బాస్ సభల్లో పాల్గొన్నప్పటికీ ఆమె ఊసే ఎత్తకపోవటం విశేషం. ఎందుకిలా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. కొత్త సందేహాలకు తావిచ్చేలా చేసింది.

తాజాగా ఈ మౌనం వెనుక అసలు పరామర్ధాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ వివరించిన వైనం కొత్త చర్చకు తెర తీసింది. కొత్తగా పార్టీని ఏర్పాటు చేస్తున్న షర్మిల.. తన పార్టీ ప్రారంభానికి కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టటానికి ఏం వ్యాపారాలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చటానికి బీజేపీ మద్దతుతో షర్మిల పార్టీని ఏర్పాటు చేసినట్లుగా మధు యాష్కీ ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపణలు కొత్త ప్రశ్నల్ని తెర మీదకు తీసుకొస్తున్నాయి.

కాంగ్రెస్ ఓట్లను షర్మిల పార్టీ చీలిస్తే.. బీజేపీకి కలిగే లాభమేంటి? టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అయితే కాంగ్రెస్ కు లేదంటే బీజేపీకే పడే వీలుంది. కొన్ని వర్గాలు బీజేపీకి దూరమన్న వాదన కూడా సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంలోనూ.. ఈ మధ్యన జరిగిన దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికలు స్పష్టం చేసిన దరిమిలా.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీల్చటానికి షర్మిల అవసరం ఏమిటన్నది అసలు ప్రశ్న. ఆ మాటకు వస్తే.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అన్నది తెలంగాణలో పెద్దగా లేదన్న విషయం ఇటీవల జరిగిన ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి వేళలో.. షర్మిల పార్టీ అవసరం ఏమిటి? అన్నది అసలు ప్రశ్నగా మారింది.

రాజకీయ వర్గాల అంచానా ప్రకారం సరికొత్త లాజిక్ తెర మీదకు వస్తోంది. అదేమంటే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించటమే ఎజెండాగా రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చటానికి ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించటం.. ఆ వ్యతిరేక ఓట్లు మొత్తం ఒకే పార్టీకి గంపగుత్తగా పడకుండా ఉండేలా వీలైనన్ని రాజకీయ వేదికలు ఉండేలా ఏర్పాట్లు జరగటం గమనార్హం.

కేంద్రంలోని మోడీ సర్కారు మీద పెరుగుతున్న వ్యతిరేకత పుణ్యమా అని.. బీజేపీ బలహీనమవుతున్న వేళ.. కాంగ్రెస్ బలోపేతం కాకుండా ఉండటానికే షర్మిల పార్టీ అని చెబుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును కాంగ్రెస్.. షర్మిల పార్టీలు పంచుకుంటే అంతిమంగా లాభ పడేది టీఆర్ఎస్సేనన్నది తాజా వాదన. దీని కారణంగా బీజేపీకి జరిగే లాభం ఏమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. దీనికి సమాధానం ఏమంటే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2019 మాదిరి కమలం పార్టీ భారీ మెజార్టీని సాధించే అవకాశం లేదు.

అలాంటి వేళ మిత్రపక్షాల దన్ను అవసరం. అలాంటి మిత్రపక్షంగా టీఆర్ఎస్ నిలిచే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే.. కేసీఆర్ కుటుంబం అవినీతి గురించి మాట్లాడే తెలంగాణ బీజేపీ నేతలు ఎవరూ ఆ వివరాల్ని ఎందుకు బయటపెట్టటం లేదన్నది మరో ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు కేసీఆర్ సర్కారు వ్యతిరేక ఓటు చీలికలు పీలికలు కావాలి. అదంతా కేసీఆర్ కు ప్రయోజనం కలిగేలా జరిగాలి. అలా చేయటం కోసమే.. షర్మిల ఎంత ఘాటుగా విమర్శ చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగాలన్న వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో వాస్తవం ఎంతన్నది కాలమే సమాధానం చెప్పాలి.