Begin typing your search above and press return to search.

పొత్తులపై బీజేపీ, టీడీపీ షాకిస్తున్నా జనసేన వెనక్కి తగ్గడం లేదుగా!

By:  Tupaki Desk   |   9 Jun 2022 3:41 AM GMT
పొత్తులపై బీజేపీ, టీడీపీ షాకిస్తున్నా జనసేన వెనక్కి తగ్గడం లేదుగా!
X
కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన పొత్తుల ప్రకటనలపై రేగిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. పవన్ పొత్తుల ప్రకటనలపై ఆయా పార్టీలు, నేతలు, రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. పవన్ ప్రకటించిన మూడు ఆప్షన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏమీ స్పందించకలేదు. అయితే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం జనసేనతో పొత్తు వద్దని, ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే పవన్ కల్యాణ్ కు బిగ్ షాకిచ్చారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన జేపీ నడ్డా రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎక్కడా జనసేన ప్రస్తావన తేలేదు ఆయన. తమ అధినేతను జనసేన-బీజేపీ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన జనసేన పార్టీ శ్రేణులకు నడ్డా మాటలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.

ఇదిలా ఉంటే జనసేనలో ముఖ్య నేతగా, పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా కొనసాగుతున్న పసుపులేటి హరిప్రసాద్ మాత్రం ఇవేమీ పట్టనట్టు ముందుకు వెళ్లిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు)లో ఆయన జనసేన పార్టీ తరఫున అప్పుడే అభ్యర్థిని కూడా ప్రకటించేయడం గమనార్హం. గంగాధర నెల్లూరు నుంచి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున డాక్టర్ యుగంధర్ పోటీ చేస్తారని హరిప్రసాద్ ప్రకటించేశారు. అంతేకాకుండా టీడీపీ తమతో పొత్తులో ఉన్నా కూడా జీడీ నెల్లూరు నుంచి జనసేన పార్టీనే పోటీ చేస్తుందని హరిప్రసాద్ ఢంకా బజాయించడం విశేషం.

జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంలో ఏమాత్రం తప్పు లేకపోయినా తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా తమ పార్టీ అభ్యర్థే జీడీ నెల్లూరులో పోటీ చేస్తారని అనడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. పవన్ కల్యాణ్ పొత్తులపై తన మనసులో మాటను ప్రకటించినా టీడీపీ ఆచితూచి స్పందించే యోచనలో ఉంది. బీజేపీ అయితే అస్సలు జనసేనతో తమకే పొత్తే లేదన్నట్టు తేల్చిచెప్పేసింది.

మరి ఈ నేపథ్యంలో జనసేన నేత హరిప్రసాద్ తొందరపడి ముందే కూసిన కోయిలలాగా పొత్తుల లెక్కలు తేలకముందే అప్పడే తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించేస్తుండటం విశేషం. గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి వైఎస్సార్సీపీ తరఫున కళత్తూరు నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైఎస్ జగన్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ తరఫున ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది.

ఇక జీడీ నెల్లూరు టీడీపీ ఇన్చార్జిగా భీమినేని చిట్టినాయుడు ఉన్నారు. ఈయన కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. అయిత ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు్ కావడంతో ఇక్కడ నుంచి గతంలో పోటీ చేసిన ఆనగంటి హరికృష్ణే మళ్లీ పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. స్వతహాగా వైద్యుడైన హరికృష్ణ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు.