Begin typing your search above and press return to search.

టీడీపీ, బీజేపీ దగ్గరవుతోందా? ఇదే నిదర్శనం.!

By:  Tupaki Desk   |   21 Nov 2019 7:07 AM GMT
టీడీపీ, బీజేపీ దగ్గరవుతోందా? ఇదే నిదర్శనం.!
X
మాములుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముందుగా తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలకు వివిధ పదవులు ఇచ్చి ఆ తర్వాత మిగతా మిత్రపక్షాలు, ఇతర పార్టీల ఎంపీలకు చోటిస్తుంది. ఇక ప్రతిపక్షాలైన వారికి అస్సలు పదవులు ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ తాజాగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తమ ప్రత్యర్థి చంద్రబాబు పార్టీ ఎంపీలకు పదవులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం మొత్తం మీద గెలిచిన 545 మంది ఎంపీలుండగా.. అందులో స్వల్ప సంఖ్యలో ఉన్న ఐదుగురు టీడీపీ ఎంపీలకు కేంద్ర కమిటీల్లో చోటుదక్కడం విశేషంగా మారింది.

కేంద్రంలోని సలహా, సంప్రదింపుల కమిటీల్లో ఐదుగురు టీడీపీ ఎంపీలకు చోటు లభించడం విశేషం. సాదా సీదా పదవులైనా సరే గత ఎన్నికల్లో అంతలా దుమ్మెత్తిపోసిన టీడీపీ పార్టీకి బీజేపీ సర్కారు ఇలా పదవులతో పందేరం నిర్వహించడం వీరి మధ్య గ్యాప్ తీరిపోయిందనడానికి నిదర్శనంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఐదుగురు టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రిత్వ శాఖల సలహా, సంప్రదింపుల కమిటీల్లో చోటు ఇచ్చింది. వాటి వివరాలను చూద్దాం
*కేంద్ర యువజన వ్యవహారాల శాఖ కమిటీలో-కింజారపు రామ్మోహన్ నాయుడును నియమించింది..
*పట్టణాభివృద్ధి శాఖ కమిటీలో-ఎంపీ గల్లా జయదేవ్, ఎంపీ తోట సీతారామలక్ష్మి
* రోడ్లు, రవాణా శాఖ కమిటీలో -కేశినేని నాని
*కేంద్ర హోంశాఖ సలహా సంప్రదింపుల కమిటీలో-ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లకు చోటు ఇచ్చింది.

ఇలా టీడీపీ అంటేనే మొదట కస్సుబుస్సులాడిన బీజేపీ పెద్దలు ఇప్పుడు ఆ పార్టీలోని ఎంపీలకు సైతం సలహా కమిటీల్లో చోటు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి బీజేపీ, టీడీపీ బంధం దగ్గరవుతుందన్న సంకేతాలను బీజేపీ అధిష్టానం ఇచ్చినట్టైంది