Begin typing your search above and press return to search.

బోనెక్కించారంటూ బీజేపీ ఫీలవుతోంది

By:  Tupaki Desk   |   24 July 2016 5:59 AM GMT
బోనెక్కించారంటూ బీజేపీ ఫీలవుతోంది
X
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీలో తీవ్ర అంతర్మథనం మొదలైంది. ప్రత్యేక హోదా పాపం మొత్తం తమకే చుట్టుకుంటోందని ఫీలవుతోంది. మిత్రపక్షం - ప్రతిపక్షం - తెదేపా అనుకూల మీడియా కలసి ప్రత్యేక హోదాపై తమను ముద్దాయిగా నిలబెట్టాయని ఫీలవుతోంది. బిల్లు ఓటింగు వరకూ రాదని తెలిసినప్పటికీ - రాష్ట్రంలో ఎదురుదాడి - ఆత్మరక్షణ ఏవిధంగా ఉండాలన్న దానిపై రాష్ట్ర నాయకత్వం నుంచి దిశానిర్దేశం కరవయిందన్న ఆగ్రహం బిజెపి నేతల్లో వ్యక్తమవుతోంది.

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపి కెవిపి ప్రైవేటు మెంబర్ బిల్లు వ్యవహారంలో, తమ పార్టీ ప్రజల ముందు ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితికి - తమ నాయకత్వ ముందుచూపులోపమే కారణమన్న భావన రాష్ట్ర బిజెపి నేతల్లో వ్యక్తమవుతోంది. శుక్రవారం బిల్లుపై హడావిడి జరుగుతుందని తెలిసినప్పటికీ - ఆ మేరకు టిడిపి-కాంగ్రెస్ వైఖరిపై ఏవిధంగా ఎదురుదాడి చేయాలి? తమ పార్టీని ఏవిధంగా విమర్శల నుంచి కాపాడుకోవాలన్న అంశంపై ముందస్తు వ్యూహం - చర్చ లేకపోవడంపై నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

‘ఏమాత్రం బలం లేని కాంగ్రెస్ - అధికారంలో ఉన్న టిడిపి దీనిపై మూడురోజులపాటు వ్యూహరచన చేశాయి. సభలోనూ, బయటా ఏం మాట్లాడాలి? ఏవిధంగా వ్యవహరించాలి? మీడియాకు ఏం చెప్పాలన్న అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేశాయి. కానీ మా నాయకత్వం మాత్రం కనీస చర్చ కూడా జరపలేదు. పోనీ అధికార ప్రతినిధులతోయినా పార్టీ వ్యూహంపై చర్చించారా అంటే అదీ లేదు. ఫలితంగా, టిడిపి-కాంగ్రెస్-మీడియా మొత్తం కలిసి హోదాపై మా పార్టీని జనం ముందు ముద్దాయిగా నిలబెట్టాయ’ని ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్-బిజెపి కలసి కుట్ర - అవగాహనతో బిల్లును అడ్డుకున్నాయని తెదేపా ఎంపి సీఎం రమేష్ ఆరోపణ చేసినా, ఒక్కరూ స్పందించలేదంటే రాష్ట్రంలో పార్టీ దుస్థితి ఏమిటో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆదివారం విశాఖలో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో దీనిపై చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.