Begin typing your search above and press return to search.

వారితో పని లేదా : ఆ రెండు పార్టీలలో మంటే మంట...?

By:  Tupaki Desk   |   7 Jun 2022 12:30 AM GMT
వారితో పని లేదా : ఆ రెండు పార్టీలలో మంటే మంట...?
X
ఏపీలో చాలా పార్టీలు ఉన్నాయి. కానీ రాజకీయం మాత్రం కేవలం నాలుగు పార్టీల మధ్యనే సాగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఫోర్ ఫ్రంట్ లో ఉంటూ పాలిటిక్స్ చేస్తున్నాయి. ఆ తరువాత వరసలో జనసేన బీజేపీ కాంబో కూడా తగ్గేది లేదు అంటూ సౌండ్ చేస్తోంది. వచ్చే ఎన్నికలు గెలుపులూ సీఎం కుర్చీలు, పొత్తులు, వాటాలు, పోటీలు అన్నీ కూడా ఈ పార్టీల మధ్యనే చర్చగా మారుతున్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే మిగిలిన పార్టీలను ఎందుకో పక్కన పెట్టేశారనే అనిపిస్తోంది. దీంతో ఆ రెండు పార్టీలు బాగా రగులుతున్నాయి. ముఖ్యంగా  జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ పొత్తులపైన కుండబద్ధలు కొట్టాక కామ్రేడ్స్ ఆశలు ఆవిరి అయ్యాయనే అంటున్నారు. పవన్ ఇక్కడ మాట్లాడింది చాలా కాలుక్యేటెడ్ గా కరెక్ట్ గా ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన ఎట్టిపరిస్థితులలోనూ బీజేపీని వీడేది లేదు అన్న సందేశం అయితే వినిపించారు.

ఇక టీడీపీతో మైత్రిని కోరుతూ షరతులు పెట్టారు. ఇక ఈ ముచ్చటను తేల్చుకోవాల్సింది ఆయా పార్టీలే. ఇంతకాలం చంద్రబాబుతో భుజం భుజం కలుపుతూ అమరావతి రాజధాని ఉద్యమం నుంచి నేటి దాకా అడుగులో అడుగు వేస్తున్న కామ్రేడ్స్ ఈసారి తాము పొత్తులాటలో ఉంటామని అనుకున్నాయి. బీజేపీ మైనస్ అయ్యే కూటమిలో తమకు చాన్స్ కచ్చితంగా దక్కుతుంది అని లెక్కలు వేశాయి.

కానీ పవన్ బీజేపీతో సహా అని చెప్పడంతో పాటు, ఒకవేళ ఆయా పార్టీలు రాకపోతే సోలోగా పోటీ అన్న మాట అన్నారే కానీ కామ్రేడ్స్ కాంగ్రెస్ ల గురించి మాట మాత్రం కూడా ప్రస్థావించలేదు. దేశంలో ఇపుడు యాంటీ మోడీ ఫ్రంట్ కట్టేందుకు చాలామంది ఉత్సాహవంతులు సిద్ధపడుతున్నారు.

అలాంటి వేళ ఏపీలో కూడా కామ్రేడ్స్ తో, కాంగ్రెస్ తో కలుపుకుని ముందుకు సాగే విషయం జనసేనాని ఎందుకు ఆలోచన చేయలేదు అన్న చర్చ కూడా వస్తోంది. అదే టైమ్ లో ఆయన వస్తే బీజేపీ వస్తే టీడీపీ అంటూ అక్కడే ఆగిపోవడంతో కూటమిలో చోటు మాకు లేదా అన్న ఆగ్రహం అయితే కామ్రేడ్స్ లో కనిపిస్తోంది అంటున్నారు.

దీని మీద సీపీఎం నాయకుడు పి మధు అయితే జనసేనాని మీద తన ఆగ్రహాన్ని దాచుకోలేకపోయారు. పొత్తులతో ఇపుడు పనేంటి పవన్, ముందు ప్రజా సమస్యల సంగతి చూడు అంటూ క్లాస్ తీసుకునే విధంగా మాట్లాడారు. జనసేనకు సిద్ధాంతాలు లేవని కూడా సెటైర్లు వేశారు. బీజేపీతో పొత్తులకు ఆరాటపడడం కంటే దారుణమైన రాజకీయం ఉండబోదు అని కూడా మండిపడ్డారు. ఏపీకి  బీజేపీ ఇచ్చిన విభజన హామీల మాటేమిటి అని నిలదీశారు. మొత్తానికి కామ్రేడ్స్ లేని పొత్తు వంటకం వారికి గిట్టడంలేదని అర్ధమవుతోంది అంటున్నారు. సీపీఐ తీరు కూడా ఇలాగే ఉంది కానీ వారు ఇంకా బయటపడడంలేదు అంటున్నారు.

ఇంకో వైపు కాంగ్రెస్ నేతలు సైతం పవన్ మీద గతకొద్ది నెలలుగా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆయన జనసేన ఆవిర్భావ సభలో  బీజీపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలని చేసిన ప్రసంగం నుంచి తులసీరెడ్డి లాంటి వారు అయితే పవన్ మీద బాణాలు వేస్తూనే ఉన్నారు. మొత్తానికి 2024లో అయినా రాజకీయం మారుతుందని, తమకో దారి చూపిస్తుందని కామ్రేడ్స్, కాంగ్రెస్ ఆశపడుతూంటే గుడుగుడుగుంచం మాదిరిగా పొత్తులూ, ఎత్తులు అన్నీ కూడా ఆయా పార్టీల చుట్టూనే తిరగడం పట్ల ఈ రెండు జాతీయ పార్టీలు ఒక్కలా మండడంలేదుట.