Begin typing your search above and press return to search.

జీవో 120 : సూపులో పడ్డ చంద్రబాబు సర్కార్‌!

By:  Tupaki Desk   |   11 Sep 2015 4:32 AM GMT
జీవో 120 : సూపులో పడ్డ చంద్రబాబు సర్కార్‌!
X
ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయమూ.. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికీ సమానంగా లబ్ధి చేకూరుస్తుందని.. ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా ఉంటుదని చెప్పలేం. అయితే ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం దానివలన మెజారిటీ ప్రజలకైనా లబ్ధి ఉంటుందా లేదా.. అలాంటి నిర్ణయం ద్వారా మెజారిటీ ఉండనటువంటి చిన్న వర్గాలను మనం పొరబాట్న బలవంతంగా అణచివేస్తున్నామా లేదా? అనే అంశాలను ప్రభుత్వం ఒకసారి తర్కించుకుని నిర్ణయం తీసుకోవాలి. అలాంటి కసరత్తు చేయకుండా.. వెనుకబడిన ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించేలా చంద్రబాబు సర్కారు తీసుకువచ్చిన జీవో నెంబర్‌ 120 ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు సూపులో పడేసింది. బయటపడకపోయినప్పటికీ ప్రభుత్వం గిలగిలా కొట్టుకుంటున్నట్లే లెక్క.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతల వల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు నష్టపోకుండా ఉండేందుకు గాను అప్పట్లో జోనల్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. దీనివల్ల అన్ని ప్రాంతాలకు సమానంగా న్యాయం జరుగుతుందని ఆశించారు. విశాలమైన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలు బాగా వెనుకబడినవి అయినప్పటికీ విద్యా, ఉద్యోగ అవకాశాల పరంగా వారు మరీ నాశనం అయిపోకుండా మనగలిగారంటే కేవలం ఈ జోనల్‌ వ్యవస్థే కారణం.

కానీ రాష్ట్ర విభజన అయిన తర్వాత.. ఎందుకో తెలియదు గానీ.. తెలుగుదేశానికి ఈ జోన్లమీద కంటగింపుగా ఉన్నట్లున్నది. ఆ వ్యవస్థ కేవలం తెలంగాణకోసమే తీసుకువచ్చినదిగా అభివర్ణిస్తూ.. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినందున ఏపీలోని 13 జిల్లాలను ఒకే యూనిట్‌ చేయాలని జోన్ లు అనవసరం అని ఆ మధ్య మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేశారు. అయితే అలాచేయడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రలు బాగా నష్టపోతాయంటూ ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈలోగా.. తిరుపతి మెడికల్‌ కళాశాలలో ఎడ్మషన్ లకు గాను రాష్ట్రం మొత్తాన్ని ఒకటే యూనిట్‌ గా పరిగణించే జీవో 120 ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో అక్కడ రాయలసీమ, నెల్లూరులకు చెందిన విద్యార్థులు తమ అవకాశాలను భారీగా నష్టపోయారు. అప్పటికి గానీ.. జీవో 120 వలన నష్టాలేమిటో వెలుగుచూడలేదు.

మెడికల్‌ ఎడ్మిషన్ ల తర్వాత.. పలువురు దీనిపై ఆందోళన చేశారు. తాజాగా వైకాపా, భాజపా కూడా ఈ సమస్యను టేకప్‌ చేశాయి. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, అలాగే భాజపా నేత విష్ణువర్దన్‌ రెడ్డి దీని రద్దుకు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిపక్షాల డిమాండ్‌ కు మద్దతుగా తమ ప్రభుత్వంలో పార్ట్‌ అయిన భాజపా కూడ గళం కలపడం విశేషం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యగా కనిపిస్తోంది. చంద్రబాబు సర్కారు భాజపాను ఎలా జోకొడుతుందో.. ఈ జీవో 120 విషయంలో ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.