Begin typing your search above and press return to search.

దోచుకోవడమే పనిగా జగన్ పాలన.. కన్నా విమర్శలు

By:  Tupaki Desk   |   12 Feb 2020 10:00 AM GMT
దోచుకోవడమే పనిగా జగన్ పాలన.. కన్నా విమర్శలు
X
అధికార వికేంద్రీకరణ ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు చేసిన ప్రతిపాదనను కేంద్రం స్పందిస్తూ అది రాష్ట్ర పరిధిలోని అంశం అని పేర్కొనగా ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ మాత్రం రాజధానిపై రాద్ధాంతం చేస్తోంది. అమరావతిని కొనసాగించాలని ఉద్యమించకుండా.. మీడియా కనిపిస్తే చాలు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి బీజేపీ నాయకులది. అమరావతిలో రాజధాని కొనసాగించాలని, విశాఖలో రాజధాని వద్దని చెబుతూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. దీనికితోడు జగన్ పాలన తో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమరావతి ప్రాంత రైతులు బుధవారం కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. అమరావతి పోరుపై భవిష్యత్తు కార్యాచరణ, బీజేపీ మద్దతుపై సమాలోచనలు జరిపారు. సమావేశం అనంతరం కన్నా మాట్లాడుతూ.. దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖపట్టణంలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రజాక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంతసేపూ యథేచ్ఛ గా దోచుకోవడంపైనే ఆలోచిస్తుందని విమర్శించారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చి మభ్యపెడుతున్నారని తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వ పరిపాలన పై కూడా కన్నా విమర్శలు చేశారు. విశాఖ లో రాజధాని ఏర్పాటు చేస్తే ప్రశాంతం గా ఉండలేమని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా ప్రజలు కూడా విశాఖలో రాజధాని వద్దంటున్నారని తెలిపారు.

అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ విధానాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల రక్తం పీల్చేలా వైఎస్సార్సీపీ పాలన కొనసాగుతోందని మండి పడ్డారు. అమరావతి లోనే రాజధాని ఉండేలా తాము పోరాడతామని స్పష్టం చేశారు.