Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌రే.. మ‌రి బీజేపీ ఏపీకి చేసిందేమిటి?

By:  Tupaki Desk   |   8 Oct 2022 10:30 AM GMT
కేసీఆర్ స‌రే.. మ‌రి బీజేపీ ఏపీకి చేసిందేమిటి?
X
తెలంగాణ సీఎం కేసీఆర్.. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్)ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున దేశ‌వ్యాప్తంగా 150 లోక‌స‌భ స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టాల‌ని కేసీఆర్ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా తెలంగాణ‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల‌పై కేసీఆర్ దృష్టి సారించార‌ని అంటున్నారు.

అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్పుడే చుక్కెదురవుతోంది. కేసీఆర్ కాదు కేసీఆర్ తాత వ‌చ్చినా మాకు న‌ష్టం లేద‌ని వైసీపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. వ‌చ్చే 25, 30 ఏళ్లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే సీఎంగా ఉంటార‌ని వైసీపీ నేత‌లు తేల్చిచెబుతున్నారు. కేసీఆర్ పార్టీని ప్ర‌జ‌లెవ‌రూ పట్టించుకోర‌ని తేల్చిచెబుతున్నారు.

మ‌రోవైపు బీజేపీ ఏపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టే ముందు ఏపీ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఏపీకి తీర‌ని ద్రోహం చేసిన కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వ‌స్తార‌ని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి నిల‌దీశారు. గ‌తంలో తెలుగు త‌ల్లి విగ్ర‌హానికి చెప్పుల దండ వేసి కాళ్లు చేతులు తొల‌గించార‌ని నిప్పులు చెరిగారు. ఎంతో మంది మ‌హానుభావుల విగ్ర‌హాల‌ను తొల‌గించార‌ని.. ముందు వారి కుటుంబాల‌కు కేసీఆర్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దేశంలో కేఏ పాల్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి తేడా లేద‌ని ఎద్దేవా చేశారు.

క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు తెలంగాణ త‌ల్లిని ఎలా తీసుకొస్తారో చెప్పాల‌ని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి నిల‌దీశారు. దేశాన్ని ఏకం చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న కేసీఆర్‌.. ముందుగా ఏపీ నీటి ప్రాజెక్టుల‌పై త‌న వైఖ‌రి ఏంటో చెప్పాల‌న్నారు.

విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. అంతేకాకుండా గ‌తంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను దూషిస్తూ.. అవ‌మానిస్తూ కేసీఆర్ మాట్లాడిన మాట‌ల తాలూకు వీడియోల‌ను కూడా బీజేపీ ప్ర‌ద‌ర్శించే వీలుంద‌ని అంటున్నారు. అలాగే శ్రీశైలం, పోల‌వ‌రం, పోతిరెడ్డిపాడు త‌దిత‌ర నీటి ప్రాజెక్టుల‌కు సంబంధించి కేసీఆర్ ప్ర‌భుత్వం ఏపీని ముప్పతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీలో ఉనికి చాటుకోవ‌డం కూడా క‌ష్ట‌మే అంటున్నారు.

మ‌రోవైపు కేసీఆర్ ఏపీకి చేసిన ద్రోహం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే బీజేపీ కూడా త‌క్కువ చేయ‌లేదు క‌దా అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్‌, ఇత‌ర పెండింగ్ స‌మ‌స్య‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డి వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు ఉన్నాయ‌ని గుర్తు చేస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌బోమ‌ని బీజేపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే తేల్చిచెప్పింద‌ని అంటున్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వ‌డం లేదు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు విడుదల చేయకుండా స‌మ‌స్య‌లు సృష్టిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నారు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సైతం ప్రైవేటుప‌రం చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ చుట్టూ ఇన్ని వైఫ‌ల్యాలు పెట్టుకుని కేసీఆర్‌ది మాత్ర‌మే త‌ప్పు అన్న‌ట్టు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడ‌టం స‌రికాద‌ని చెబుతున్నారు. మ‌రి వీట‌న్నింటికీ బీజేపీ ప్ర‌భుత్వం లేదా బీజేపీ నేతలు క్ష‌మాప‌ణ‌లు చెప్పారా అని నిల‌దీస్తున్నారు. కేసీఆర్ ఒక‌లాగా ఏపీని దెబ్బ‌కొడితే.. బీజేపీ నేత‌లు మ‌రోలా ఏపీని దెబ్బ‌తీశార‌ని మండిప‌డుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.