Begin typing your search above and press return to search.

ఏంది భ‌య్యా ఇది.. మీది పార్టీనా; క‌ంపెనీనా!

By:  Tupaki Desk   |   24 Nov 2018 5:42 PM GMT
ఏంది భ‌య్యా ఇది.. మీది పార్టీనా; క‌ంపెనీనా!
X
రాజ‌కీయం... చేయ‌డం చాలా క‌ష్టం అనుకునేవారు. ఇపుడు అంతా మారిపోయింది. రాజ‌కీయం చేయ‌డం క‌ష్టం మాత్ర‌మే కాదు బాగా ఖ‌రీదు. అస‌లు సిద్ధాంతాలు - రాద్ధాంతాల‌తో పార్టీలు న‌డిచే కాలాలు పోయాయి. ఇపుడు క‌రెన్సీ నోట్ల వెయిట్ నుంచి బ‌ట్టి పార్టీకి వెయిట్ ఉంటోంది. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇలాంటి క‌ఠిన నిజాల‌న్నీ తెలుస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఓటింగ్ పూర్త‌యింది. తెలంగాణ - రాజ‌స్థాన్‌ - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - మిజోరంల‌లో పోలింగ్ కి ఎంతో స‌మ‌యం లేదు. రాజ‌కీయ పార్టీలు అన్నిటికీ స‌ర్వ‌దా సిద్ధ‌మ‌య్యాయి. కష్ట‌ప‌డుతూ, ఖ‌ర్చుపెడుతూ... బ‌తిమాలుతూ ఎన్నిక‌ల స‌ముద్రాన్ని ఈదుతున్నారు అభ్య‌ర్థులు, పార్టీలు. సాధ్య‌మైనంత విస్తృతంగా ప్ర‌చార ప‌ర్వాన్ని కొన‌సాగిస్తున్నాయి. ఎప్ప‌టిక‌పుడు కొత్త ప్ర‌చారాలు వ‌స్తున్నాయి గాని పాత ఖ‌ర్చులు త‌గ్గ‌డం లేదు. దీంతో పార్టీలు ఈ ఖ‌ర్చుల‌కు త‌ట్టుకోలేక‌పోతున్నాయి. ఇపుడున్న మార్గాల్లో ప్ర‌భావ‌వంత‌మైన‌వి టీవీ-సోష‌ల్‌మీడియా. రెండూ కాస్ట్లీయే.

అయితే, పార్టీల‌కు వీటికి ఎంత ఖ‌ర్చ‌వుతుంద‌నే విష‌యంపై అత్య‌ధికుల‌కు అవ‌గాహ‌న ఉండ‌క‌పోవ‌చ్చు. అది ఆస‌క్తిక‌ర‌మే కానీ అవ‌స‌రం కాదు కాబ‌ట్టి అదేప‌నిగా ఎవ‌రూ తెలుసుకోరు. కానీ... తాజాగా వెల్ల‌డ‌యిన ఓ విష‌యం విని అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. మోడీ అంటే ప‌బ్లిసిటీ అనే విష‌యం ఇంత‌వ‌ర‌కు మ‌నం చూశాం. కానీ ఇపుడు మీకు దాని పీక్స్ ఏంటో తెలుస్తుంది.

దేశ‌వ్యాప్తంగా టీవీల‌ను ప్ర‌క‌ట‌న‌కు వాడుకోవ‌డంలో బీజేపీ అన్ని రికార్డుల‌ను చెరిపేసింది. కేవ‌లం ఇత‌ర పార్టీల కంటే చాలా ముందంజలో ఉండ‌టం కాదు... అస‌లు పెద్ద‌పెద్ద అంత‌ర్జాతీయ కార్పొరేట్ కంపెనీల కంటే ముందుండ‌టం షాకింగ్‌. ఎన్నిక‌ల రాష్ట్రాల్లో ప్రస్తుతం టీవీ పెడితే చాలు బీజేపీ యాడ్లేన‌ట‌. సాధార‌ణంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ వంటి కంపెనీలు ప్ర‌క‌ట‌న‌ల‌కు భారీగా ఖ‌ర్చుపెడ‌తాయి. అందుకే మ‌నం ఎపుడు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ చూసినా అవే క‌నిపిస్తాయి. కానీ వీటిని ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయింది బీజేపీ. టీవీ యాడ్‌ల‌కు సంబంధించి బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) వివ‌రాల ప్ర‌కారం టీవీ ప్ర‌క‌ట‌న‌ల్లో బీజేపీ నెం1 అట‌. న‌వంబ‌రు 16 నాటికి విమ‌ల్ పాన్ మ‌సాలా యాడ్ల‌ను కూడా తోసిరాజ‌ని బీజేపీ ప్ర‌క‌ట‌న‌ల్లో అగ్ర‌స్థానాన్ని ద‌క్కించుకుంద‌ట‌. చిత్ర‌మేంటంటే... కాంగ్రెస్ పార్టీ గురించి మ‌నం విన్న‌దే నిజ‌మైంది. ఆ పార్టీకి ఆర్థిక కష్టాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. ఎందుకంటే క‌నీసం కాంగ్రెస్ టాప్‌-10లోనూ చోటు ద‌క్కించుకోలేక‌పోయింది.

ఈ న‌వంబ‌రు 10-16 మ‌ధ్య బీజేపీ యాడ్‌లు టీవీల్లో 22,099 సార్లు ప్ర‌సార‌మ‌య్యాయ‌ని వెల్ల‌డించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ యాడ్‌లు కేవ‌లం అందులో స‌గం అంటే 12,951 సార్లు ప్ర‌సార‌మ‌య్యాయ‌ట‌. ఇపుడే బీజేపీ ఇలా ఖ‌ర్చుపెడితే సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఇంకెలా ఖ‌ర్చుపెడుతుందో మ‌రి. అస‌లు ఇత‌ర పార్టీల‌కు స్లాట్ అయినా దొర‌క‌నిస్తుందా? అని అనుకునే ప‌రిస్థితి.

యాడ్ స్పేస్ కొన్న టాప్ 10 లిస్ట్‌

1) బీజేపీ
2) నెట్‌ఫ్లిక్స్
3) ట్రివాగో
4) సంతూర్ శాండల్
5) డెటాల్ లిక్విడ్ సోప్
6) వైప్
7) కోల్గేట్ డెంట‌ల్ క్రీమ్
8) డెటాల్ టాయిలెట్ సోప్
9) అమ‌జాన్ ప్రైమ్ వీడియో
10) రూప్ మంత్ర ఆయుర్ ఫేస్ క్రీమ్

కొస‌మెరుపు- అంతా ఓకే గాని... ఈ లెక్క‌లు పార్టీ ఇచ్చే ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌త్రంలో ఉంటాయో త‌గ్గిస్తారో ఎవ‌రు అడ‌గాలి? అయినా ఇన్ని డ‌బ్బులెక్క‌డివి సామీ.